కరోనా ఎఫెక్ట్.. గతం మరిచిపోయిన బాలింత...   - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్.. గతం మరిచిపోయిన బాలింత…  

August 4, 2020

New York nurse who gave birth while battling COVID-19 doesn't remember being pregnant months after going into cardiac arrest and suffering a brain injury.

కరోనా ఎన్ని విషాదాలకు కారణం అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బతికున్న వారిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటోంది. తమవారిని పోగొట్టుకున్న బంధువులను ఎంతో మనోవేదనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎందరో కరోనాతో తమవారిని పోగొట్టుకుని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. తాజాగా ఓ మహిళ కరోనా ప్రభావంతో తాను గర్భవతిని అయ్యానని, బిడ్డ కూడా జన్మించింది అనే విషయాలను మరిచిపోయింది. బిడ్డ బోసి నవ్వులు చిందిస్తున్నా, గుక్క పట్టి ఏడుస్తున్నా ఆ తల్లి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోతోంది. బిడ్డను చూడటం లేదు.. ఎత్తుకోవడం లేదు. తాను ఈ బిడ్డకు తల్లిని అనే విషయాన్ని సాంతం మరిచిపోయిందామె. గుండెలను పిండేస్తున్న ఈ సంఘటన న్యూయార్క్‌లోని బ్రూక్లేన్‌లో చోటుచేసుకుంది. సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్‌డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది.  ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అదే సమయంలో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. రెండు వారాల తర్వాత ఏప్రిల్ 12న ఆమెకు గుండె నొప్పి కూడా వచ్చి ఎంతో బాధను  అనుభవించింది. అప్పటికే ఆమె 30 వారాల గర్భవతి. ఆమె సాధారణ స్థితికి వచ్చిన తరువాత డాక్టర్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు.

ఆ సమయంలో ఆమె ఆక్సిజన్ లేకుండా నాలుగు నిమిషాలు ఉండాల్సి రాగా, ఆమె మెదడుకు గాయం అయింది. దీంతో ఆమె తన గతాన్ని మరిచిపోయింది. తాను గర్భవతిననే విషయంగానీ.. తనకు వైరస్ సోకి ఆసుపత్రిలో ఉన్నాననే ధ్యాస కూడా ఆమెకు తెలీకుండా పోయింది. ‘సెల్వియా.. చూడు నీకు బిడ్డ పుట్టింది. నీ బిడ్డ ఎంత ముద్దుగా ఉందో’ అని ఆమె బంధువులు ఎంత చెప్పినా ఆమెలో ఎటువంటి చలనం లేదు. తన భర్తను, మూడేళ్ల కుమారుడిని కూడా గుర్తుపట్టలేకుండా మౌనంగా ఉంది. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఈ క్రమంలో వైద్యులు మళ్లీ ఆమెను సాధారణ స్థితికి తేవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతీరోజూ బిడ్డ గురించి, ఆమె గతం గురించి గుర్తు చేస్తున్నారు. ఆమెలో కదలిక వస్తుందని ఎదురు చూస్తున్నారు. వైద్యుల శ్రమ ఫలించి ఆమె గతం గుర్తుకు వచ్చి మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుందాం.