అంబులెన్స్‌లో క్రికెటర్లు.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్‌లో క్రికెటర్లు.. ఎందుకంటే..

August 30, 2019

ఆపదలో నేనున్నానని పరుగెత్తుకు వచ్చేదే అంబులెన్స్. ప్రమాదంలో గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంలో అంబులెన్స్ పాత్ర అమోఘమైంది. అలాంటి అంబులెన్స్ క్రికెటర్లను కూడా ఆదుకుంది. అదేంటి వారికేమైనా జరగరానిది జరిగిందా అనే అనుమానం వద్దు. ఎందుకంటే వారు ప్రయాణిస్తున్న బస్సు నడవనని మొరాయించింది. దీంతో వారంతా అంబులెన్స్‌లో గమ్యానికి చేరుకున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే.. న్యూజిలాండ్ క్రికెటర్లు. వారికి ఈ సరికొత్త అనుభవం శ్రీలంకలో ఎదురైంది. 

క్రికెటర్లు అంటే లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలు, స్టార్ హోటళ్లలో బస వుంటుంది. అలాంటివాళ్లు అంబులెన్స్‌లో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందంటే.. శ్రీలంకలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇటీవలే టెస్టు సిరీస్ ముగించుకుని టి20 సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 1 నుంచి శ్రీలంకతో కివీస్ 3 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో వారికి కొంత విరామం లభించింది. ఇంకే శ్రీలంకను చుట్టేద్దామని, అక్కడి ప్రకృతి అందాలను అనుభూతిద్దామని వారంతా భావించారు. 

ఈ నేపథ్యంలో అక్కడి ప్రముఖ పర్యాటక స్థలం క్యాండీని సందర్శించాలని బయలుదేరారు. ఆ హిల్ స్టేషన్ అందాలు వీక్షించిన అనంతరం తిరిగి హోటల్‌కు పయనమవుతున్నారు. ఇంతలో వారు ప్రయాణిస్తున్న బస్సు పాడైంది. క్లచ్ విరిగిపోవడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్నిరకాల వాహనాలను క్రికెటర్ల తరలింపునకు ఉపయోగించారు. వాటిలో కొన్ని అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి. అంబులెన్స్‌లో ప్రయాణం తమకు చాలా కొత్తగా, వింతగా వుందని వారు తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.