లాక్‌డౌన్ ఉల్లంఘించిన మంత్రి.. ఏకంగా పదవికి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఉల్లంఘించిన మంత్రి.. ఏకంగా పదవికి రాజీనామా

July 2, 2020

New Zealand Health Minister Resign

అధికారంలో ఉంటే తమను ఆపేది ఎవరూ అన్నట్టుగా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఆంక్షలు, నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోరు. ఎవరైనా అడిగితే తాను ప్రజా ప్రతినిధిని అంటూ బుకాయిస్తారు. కానీ లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు ఏకంగా ఆరోగ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ దేశంలో మంత్రి డేవిడ్ కార్క్ గురువారం ఉదయం ఈ పని చేశారు. తాను చేసిన తప్పునకు పశ్చాతాపంగా పదవి నుంచి తప్పుకుంటున్నానని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. కీలక పదవిలో ఉన్న ఆయన విమర్శలు రావడంతో పదవికి రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది. 

ఇంతకీ మంత్రి చేసిన తప్పు ఏంటని అనుకుంటున్నారా.? కరోనా కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సమయంలో నిబంధనలు అతిక్రమించిన డేవిడ్ క్లార్క్ తన కుటుంబసభ్యులను బీచ్‌కు తీసుకువెళ్లి మౌంటెన్ బైకింగ్ ట్రాక్‌లో డ్రైవింగ్ చేశారు. ఆ విషయం బయటకు రావడంతో ఆయనపై ప్రజలు, ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో తన పాత్రను విస్మరించినందుకు రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అయింది. 

ఈ అంశంపై సీరియస్‌గా ఉన్న ఆ దేశ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ ఆయన్ను రాజీనామా చేయాలని సూచించారు. ప్రజలకు దిశానిర్ధేశం చేయాల్సిన ఆయన ఇలా నిర్లక్ష్యంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్లు డేవిడ్ క్లార్క్ ప్రకటించారు. ఈ బాధ్యతలను విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్‌కు తాత్కాలికంగా అప్పగించారు. కాగా కరోనా పోరులో ఆ దేశ ప్రధాని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పక్కాగా లాక్‌డౌన్ పాటించి అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకుండా చేశారు. అన్ని సర్ధుకోవడంతో కొన్ని రోజుల క్రితమే ఆమె లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలోనే డేవిడ్ క్లార్క్ తన కుటుంభ సభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లాడు. ఇది కాస్తా విమర్శలకు దారి తీయడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఇద్దరు మాత్రమే కరోనా రోగులు ఉన్నారు. వారు కూడా బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరు కావడం విశేషం.