లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. 46 కోట్ల లాటరీ తగిలింది..  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. 46 కోట్ల లాటరీ తగిలింది.. 

May 21, 2020

లాక్‌డౌన్‌లోనూ ఓ వ్యక్తిని లక్కు తలుపు తట్టింది. ఉద్యోగం ఊడిపోయినా.. ఏకంగా రూ.  46 కోట్లు లాటరీ రూపంలో లక్ష్మీ దేవి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. ఇది న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మధ్యతరగతి వారు కావడంతో వచ్చిన డబ్బుతో అప్పుడే ప్రణాళిక కూడా వేసుకున్నారు. పాత కారును బాగు చేయించుకోవడం, కొత్త ఇళ్లు కొనుక్కోవడం ఇలా ఆ కుటుబం ప్లాన్ చేసుకుంది. ప్రపంచం అంతా కరోనాతో కకావికలం అవుతుంటే ఆ వ్యక్తికి కలిగిన అదృష్టాన్నికి పలువురు ఆశ్చర్యపోతున్నారు. 

కొన్ని రోజులు క్రితం ఓ వ్యక్తి అదృష్టం పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే ఇటీవల అతని ఉద్యోగం ఊడిపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సరదాగా కంప్యూటర్‌లో నిమగ్నమై ఉండగా.. ఆరోజు సైట్లో లాటరీ ఫలితాలు కనిపించాయి. దీంతో తనకు ఏమైనా అదృష్టం కలిసొస్తుందేమోనని లాటరీ టికెట్‌ సరిచూసుకున్నాడు. అందులో అతని నంబర్ కనబడింది. ఏకంగా రూ.46 కోట్ల (10.3 న్యూజిలాండ్‌ డాలర్స్‌) వచ్చినట్టుగా కనిపించింది. మైలోటో కస్టమర్ కేర్ కూడా దీన్ని దృవీకరించింది. దీంతో అతడు ఎగిరి గంతేసి తమకు మంచి రోజులు వచ్చాయని సంబరపడిపోయాడు. ఈ విషయాన్ని అతని భార్యకు చెప్పడంతో ముందుగా నమ్మకపోయినా తర్వాత ఆశ్చర్యంతో సంతోషం వ్యక్తం చేసింది. వచ్చిన డబ్బును పిల్లల చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని వారు చెబుతున్నారు.