న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు.. 40 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు.. 40 మంది మృతి

March 15, 2019

న్యూజిలాండ్‌‌లోని రెండు మసీదుల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. నల్లరంగు దుస్తుల్లో వచ్చిన ఓ అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నమాజు కావడంతో మసీదుల్లో 300 మంది వున్నారు. సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని  అల్‌నూర్, లిన్‌వుడ్ మసీదులో ఈ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు మసీదులోనే కుప్పకూలి చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

New Zealand Many dead in Christchurch's twin mosque shootouts

కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. 30 మంది అల్‌నూర్‌ మసీద్‌లో.. మరో 10 మంది లిన్‌వుడ్‌ మసీదులో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇది ప్రణాళిక ప్రకారం చేసిన ఉగ్రదాడేనని ఆమె పేర్కొన్నారు.  అయితే ఈ ఘటన జరిగినప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆ ప్రాంతంలోనే వున్నారు. టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టుతో మూడో టెస్టు ఆడనుంది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు. అదృష్టవశాత్తూ తాము ఈ దాడి నుంచి తప్పించుకున్నాం.. తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు.  ‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు తమీమ్. మరోవైపు ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఘటనాస్థలంలో చాలా సేపు ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, ఈ ఘటనపై న్యూజిలాండ్‌ ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ చీకటి రోజుల్లో ఇది ఒకటని, హింసకు తీవ్రమైన రూపమని ఆమె పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో ఆమె వెల్లింగ్టన్‌ బయల్దేరారు.