ఇండోనేసియాతో కలిసి ఉండే ప్రసక్తే లేదని, తమకో ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పపువా రాష్ట్రంలోని వేర్పాటువాదులు రచ్చ రంబోలా చేస్తున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ పైలెట్‌ను కిడ్నాప్ చేసి అతనికి చుక్కలు చూపిస్తున్నారు. తమ దగ్గర బందీగా ఉన్న అతని ఫోటోలను, వీడియోలను బయటికి వదిలి ప్రపంచ దృష్టిని వింతవింత వేషాలతో ఆకర్షిస్తున్నారు. వెస్ట్ పపువా లిబరేషన్ ఆర్మీ రెబళ్లు గతవారం ఎనందుంగా కొండల్లో ల్యాండ్ అయిన ఫిలిప్ మెహర్టన్స్ అనే పొట్టకూటి పైలెట్‌ను బంధించారు. విమానంలోని మిగతా ప్రయాణికులను వదిలేసి పైలెట్‌ను తమ దగ్గరే ఉంచుకున్నారు. అతనితో తమ సపరేటు కంట్రీ నినాదాలు పలికించి, జై కొట్టించుకున్నారు. ‘‘పపువా స్వాతంత్ర్యాన్ని ఇండోనేసియా గుర్తించితీరాలి అని చెప్పు’’ అంటూ బలవంతం చేసి ఆ మాటలు చెప్పించారు. ‘‘మేం తిండికోసమో, తాగుడు కోసమే అతణ్ని కిడ్నాప్ చేయలేదు. ఇండోనేసియా మాపై దాడులు చేయనంతవరకు అతణ్ని ఏమీ చేయం’’ అని రెబళ్ల అధినేత ఇజియానస్ కోగోయా చెప్పారు.
మరోపక్క.. పైలెట్‌కు విముక్తి కల్పించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఇండోనేసియా ప్రభుత్వం చెబుతోంది. ‘‘పౌరులను కిడ్నాప్ చేయడం అన్యాయం. అతణ్ని సురక్షితంగా విడిపించడానికి అన్ని మార్గాలూ వెతుకుతాం’’ అని మంత్రి మహమ్మద్ మహఫద్ చెప్పారు. రెబళ్లు ఎర్రటి చీపురు జుట్టు, షార్టులు, టీషర్టులు, సెల్ ఫోన్లు, బాణాలు, మిషిన్ గన్లు వంటి ఆధునిక కమ్యూనికేషన్లు, పరమ నాటు పరికరాలను ధరించి చిత్ర విచిత్రంగా ఫోటోలు తీయించుకుని బయటికి వదిలారు. అయితే వారికి అంత సీన్ లేదని, ఎక్కడో కొన్ని తుపాకులు దొరకబుచ్చుకుని బెదిరిస్తున్నాని ఇండోనేసియా బలగాలు లైట్ తీసుకుంటున్నాయి.