New Zealand won by 1 run vs englanad
mictv telugu

NZ vs Eng 2nd test : టెస్ట్ క్రికెట్‌లో సంచలనం..ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

February 28, 2023

New Zealand won by 1 run vs englanad

టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్ సంచలన విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేవలం ఒక్క పరుగుతో విజయం సాధించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 256 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రూట్ 95 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా..జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 4, సౌథీ 3, మ్యాట్ హెన్నీ 2 వికెట్లు తీసారు.

బెడిసికొట్టిన బజ్‌బాల్

గత కొంతకాలంగా బజ్‌బాల్ వ్యూహంతో చెలరేగిపోతన్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదురైంది. దూకుడుగా ఆడుతూ వరుస వికెట్లను కోల్పోయి…మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 435/8 పరుగులు చేసి ఇంగ్లండ్ డిక్లేర్డ్ ఇచ్చింది. న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. కేన్ విలియమ్స్‌న్(132) సెంచరీతో చెలరేగడంతో పాటు.. టామ్ బ్లండెల్ 90, టామ్ లాథమ్ 83, డివాన్ కాన్వే 61, డార్ల్ మిచెల్ 54 పరుగులు చేయడంతో 483 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా 257 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది.

థ్రిల్లింగ్ విక్టరీ

ఓ మోస్తరు లక్ష్యాన్ని ఊదేద్దమని బరిలోకి దిగిన ఇంగ్లీష్ ఆటగాళ్లు లక్ష్యం ముందర చతికిల పడ్డారు. ఓవర్ నైట్ స్కోర్ 48/1 తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం జో రూట్-బెన్ స్టోక్స్‎లు ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో విజయంపై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే స్టోక్స్,రూట్,స్టువార్ట్ బ్రాడ్‌లు స్వల్ప వ్య వధిలో వెనుదిరిగారు. . 256 వద్ద జేమ్స్ అండర్సన్ వాగ్నర్ బౌలింగ్ లో చివరి వికెట్ గా వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది.