భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం.. NASA ఏం చెప్పిందంటే..? - Telugu News - Mic tv
mictv telugu

భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం.. NASA ఏం చెప్పిందంటే..?

March 10, 2023

Newly Discovered Asteroid Has A "Small Chance" Of Hitting Earth In 2046: NASA

అంతరిక్షంలో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా గ్రహశకలాలు తరచూ భూమివైపు వస్తుంటాయని విషయాలను అప్పుడప్పుడు వార్తల్లో వినే ఉంటాం. అదృష్టం కొద్దీ అవి భూమికి చాలా దూరంగా ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి హానీ జరగట్లేదు. అలా కాకుండా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొంటే… భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఢీకొట్టకుండా… భూమిని తాకుతూ వెళ్లినా… వంద కిలోమీటర్లకు పైగా భూమి, అక్కడి భవనాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.

ఇప్పుడు ఈ విషయాలు తెలియజేయడానికి ముఖ్య కారణం ఒకటుంది. భూమి వైపు ఓ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో అంటే 50 మీటర్ల పొడువు, 25 మీటర్ల వెడల్పు ఉన్న గ్రహశకలం ఒకటి భూమిని ఢికొట్టే అవకాశం ఉందట. NASA యొక్క ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ప్రకారం, మరో 23 ఏండ్లలో ఫిబ్రవరి 14(2046)న ఈ అస్టరాయిడ్ భూమిని ఢీకొట్టబోతుందని చెప్పింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నుండి వచ్చిన డేటా అంచనాల ఆధారంగా, 2023 DW అనే స్పేస్ రాక్.. భూమిని ఢీకొట్టే అవకాశం 625లో 1 శాతం ఉందని తెలిపింది.

కానీ NASA టీమ్ దీని గురించి సోషల్ మీడియాలో తెలుపుతూ… 2023 DW అనే కొత్త గ్రహశకలాన్ని ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ఇది 2046లో భూమిపై ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువని చెప్పారు. ఏదైనా కొత్త వస్తువులు(గ్రహ శకలాలు) మొదట కనుగొనబడినప్పుడు, భవిష్యత్తులో వాటి కక్ష్యలను తగినంతగా అంచనా వేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. ఆర్బిట్ ఎనాలిస్టులు ఈ స్పేస్ రాక్(2023 DW) ను పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత..ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలను అంచనా వేస్తారని చెప్పారు.