ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ షీట్ ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అల్రెడీ ఒక రికార్డ్ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది కనుగొన్నారు. తూర్పు అంటార్కిటికాలో ఉందీ మంచు ఫలకం. దీని కింద ఓ నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని కూడా తేలింది. హిమ ఫలకం మీద దాదాపు మూడేళ్ళు ఏరియల్ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దీనికి దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు.
ఈ సరస్సుకు ‘స్నో ఈగల్’అని పేరు పెట్టారు.దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ళ నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఒకవైపు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా వేడిమి పెరిగిపోవడం వల్ల గ్రీన్‌ల్యాండ్ లాంటి మంచు ప్రదేశాల్లో పేరుకుపోయివున్న మంచు పలకలు విపరీతంగా కరిగిపోతున్నాయని ఇది మానవాళి మనుగడకు ప్రమాదమని ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు.
అయితే ఉష్ణోగ్రతల మూలకంగా గ్రీన్‌ల్యాండ్‌లోని భారీ మంచుపలకల్లో చోటుచేసుకునే మార్పులను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాసా సౌరశక్తితో నడిచే ఒక ప్రత్యేక రోవర్‌ను కూడా గ్రీన్‌ల్యాండ్‌కు పంపనుంది. శుక్రవారం నుండి జూన్ 8 వరకూ గ్రోవర్ అనే పేరుగల ఈ రోవర్ మంచు ఫలకంపై తిరుగుతూ నమూనాలను సేకరిస్తోంది.