ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది. అయినా ఇప్పటికే యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. గెలుపు మళ్లీ తమదేనని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ధీమాగా ఉన్నాయి. ప్రతి ఇంటికీ ఆర్థికంగా లబ్ధి చేకూరే పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి జనం మళ్లీ తమకే పట్టం కడతారని సీఎం జగన్ అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, పాత పథకాలకే పేర్లు మార్చి మాయ చేసి, రాష్ట్ర సంపదను దోచుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. వైసీపీకి వచ్చేది 67 సీట్లే అంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ధీమాలు, విమర్శలు ఎలా ఉన్నా 2014లో జరగబోయే మహాసంగ్రామంలో గెలుపెవరిది? జగన్ చెబుతున్నట్లు మొత్తం 175 సీట్లూ ఆయన పార్టీకే దక్కుతాయా? బాబు అంటున్నట్లు అధికారం పచ్చపార్టీదేనా? తాము కూడా సత్తా చాటుతామంటున్న జనసేన పరిస్థితి ఏమిటి?
గెలుపు గ్యారంటీ, సీట్లు మాత్రం..
నవరత్న సంక్షేమ పథకాలు, ఇళ్లపట్టాలు, అమ్మఒడి, వాహనమిత్ర వంటి వివిధ పథకాలతో జగన్ ప్రజలకు చేరువైన మాట నిజమే. ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, వైసీపీ నేతల ఆగడాలు, విపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలు మితిమీరాయన్న విమర్శల్లోనూ నిజం లేకపోలేదు. రాజధానిని అమరావతి నుంచి తరలించడంతో దాని చుట్టుపక్కల జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత నెలకొంది. టీడీపీ బలమైన విపక్షంగా పనిచేయకపోయినా ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత సహజంగానే కలిసి వచ్చే అవకాశముంది. విశాఖలో విజయసాయిరెడ్డి భూముల వ్యవహారం వైసీపీకి అక్కడ చెడ్డపేరు తెచ్చింది. ఆంధ్ర రాష్ట్ర రాజధానిని నవ్యాంధ్రలోనూ కోల్పోయిన రాయలసీమ ప్రజలు జగన్ వెంటే ఉన్నట్లు కనిపిస్తున్నా టీడీపీ సంప్రదాయ బీసీ ఓటు బ్యాంకులో మళ్లీ కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల్లో పలువురిపై ఆరోపణలు రావడంతో ఈసారి అక్కడ కూడా వైసీపీ కొన్ని సీట్లు కోల్పోవచ్చని పరిశీలకుల అంచనా. ఏది ఏమైనా ‘ప్రజా సంక్షేమ’ ఇమేజీతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని చాలామంది నిపుణుల, సర్వేల అంచనా. అయితే 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్లు ఈసారి రాకపోవచ్చని చెబుతున్నారు. ఎంత కష్టపడినా 90 నుంచి 110 లోపు వచ్చే అవకాశముందని స్వయంగా ఆ పార్టీ నేతల అభిప్రాయం!
సర్వేల్లో..
సీపీఎస్ సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో జగన్ పార్టీకి 120 నుంచి 130 సీట్లు రావొచ్చు. పార్లమెంటు ఎన్నికల్లోనూ అధికార హవా తగ్గే అవకాశముంది. వైపీపీకి 18, టీడీపీకి 7 లోక్ సభ స్థానాలు దక్కొచ్చని ‘మూడ్ ఆఫ్ నేషన్’ సర్వే చెప్పింది. సర్వేలకంటే తన వ్యక్తిగత కరిష్మానే నమ్ముకున్న జగన్ సైతం వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లపై స్పష్టతతో చాలా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐప్యాక్‌తోపాటు నిఘా సంస్థలతో సర్వే చేయించిన ఆయన పరిస్థితిపై స్పష్టమైన అవగాహనకు వచ్చే నష్టనివారణకు దిగారు. ‘ఇంటింటికి వైసీపీ’ కార్యక్రమంతో ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి పంపడం అందులో భాగమే. బోలెడంత మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవడం, తన ఇమేజీని, తన తండ్రి ఇమేజీని శ్రుతిమించి ప్రచారం చేసుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పలువరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పక్కనబెట్టి కొత్తవారికి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
టీడీపీ పుంజుకుంటుందా?
కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వంటి పెద్దనోళ్ల వైసీపీ నేతలు హద్దుదాటి టీడీపీ నేతలను, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శించడం పచ్చపార్టీనే హైలెట్ చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు ఆయనపై కొందరిలోనైనా సానుభూతి కలిగించాయి. అధికార మత్తులో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దౌర్జన్యాలు వైసీపీ ప్రభను కొంత మసకబార్చాయి. చంద్రబాబు వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ప్రతిపక్ష నేతగా ముందుకు సాగుతున్నారు. ఆయన తన బలం వల్ల కాకుండా వైసీపీ పొరపాట్లు, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే వచ్చే ఎన్నికల్లో హాఫ్ సెంచరీ సాధించవచ్చని నిపుణుల అంచనా. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ సీట్లు చాలవు కనక చంద్రబాబే చెప్పినట్లు అవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చు. జనసేన పరిస్థితికి కూడా ఏమంత ఆశావహంగా లేదు. పవన్ కల్యాణ్ ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిసిస్తున్నాయి. టీడీపీకి దత్తపుత్రుడన్న విమర్శలు, బీజేపీపై ప్రేమ ఆయనకు లాభానికంటే నష్టమే తెచ్చిపెడతాయి. అయితే కాపులు ఎక్కువగా ఉన్న నియోజవర్గాల్లో 10 శాతం వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది వైసీపీకి, టీడీపీకీ రెండింటికీ గొడ్డలిపెట్టే. పవన్ ఎన్నికల ముందు దూకుడు పెంచితే ఐదారు సీట్లు కూడా దక్కొచ్చు. బాబుది అసమర్థ పాలన అనే జనం జగన్‌ను గెలిపించారు. దూకుడుతనం, రాజధాని విషయంలో తడబాటు నిర్ణయాలు, అధికార అవినీతి, బీజేపీకి తొత్తు అన్న విమర్శలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం తప్పక చూపించకమానవు. వైసీపీ చెబుతున్నట్లు జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలకు నిజంగానే ఎంతోకొంత లబ్ధి జరిగి ఉంటే ఫలితం ఎన్నికల్లో కనిపించకా మానదు.