ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ రహదారి (NH 167K)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మించనున్నారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు NHAI టెండర్ల ప్రక్రియను చేపట్టింది.
ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి కడప జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.