వాహనదారులకు కేంద్రంలోని మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచబోతుంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం మరోసారి టోల్ ట్యాక్స్ రూపంలోభారీ బాదుడుకు సిద్దమైంది. దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే ప్రజలు వచ్చే నెల నుంచి మరింత ఎక్కువ టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5 శాతం నుంచి 10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం మోపడమేనని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం.. ప్రతి యేటా ఏప్రిల్ 1 వరకు టోల్ ధరలను సవరిస్తుంటారు. ఈ పాలసీ ప్రకారం పెరిగిన ధరల్ని అమలు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాల్సిందిగా NHAI సంబంధిత విభాగాన్ని మార్చి 25లోపు ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. అవసరాలను బట్టి సమయానుసారంగా టోల్ సమస్యలపై పాలసీ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. కొత్త ధరల ప్రకారం.. కార్లు , తేలికపాటి వాహనాలపై ట్రిప్‌కు 5 శాతం ఎక్కువ పన్ను విధించబడుతుంది. అలాగే భారీ వాహనాలపై టోల్ పన్ను 10 శాతానికి పెంచవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
టోల్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే నివాసితులకు అందించే నెలవారీ పాస్ సౌకర్యం కూడా 10 శాతం పెంచబడుతుంది. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ గేటుకు సమీపంలో ఉన్న వారికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే, ఎవరైనా నాన్-కమర్షియల్ వాహనాన్ని కలిగి ఉండి, ఛార్జ్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తుంటే.. టోల్ ప్లాజా ద్వారా అపరిమిత ప్రయాణానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి నెలకు రూ. 315 చొప్పున నెలవారీ పాస్ తీసుకోవచ్చు.