NIA announced Rs. 25 lakh reward on Dawood Ibrahim
mictv telugu

దావూద్ ఇబ్రహీంపై రూ. 25 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

September 1, 2022

అండర్ వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన సమాచారం ఇచ్చిన వ్యక్తులకు రూ. 25 లక్షలు చెల్లిస్తామని గురువారం వెల్లడించింది. అతనితో పాటు అనుచరులు ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, హజి అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తక్ అబ్దుల్ రజాక్‌లపై రూ. 15 లక్షలు రివార్డు ఇస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ముంబయి పేలుళ్లతో పాటు వీరంతా ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాల్లో వీరి హస్తం ఉందని వివరించింది. అంతేకాక, పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరేతోయిబా, జైషే మహమ్మద్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు కీలక సహకారం అందిస్తున్నట్టు తెలిపింది. కాగా, 1993లో ముంబైలో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. అటు ఐక్యరాజ్యసమితి దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం దావూద్ కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్టు అధికారికంగా వెల్లడైంది.