గత ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. నేడు మరోసారి NIA కోర్టులో విచారణ జరిపింది. ఇటీవల జరిగిన విచారణల భాగంగా కోర్టు ఆదేశాల మేరకు కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేష్‌ను కూడా న్యాయస్థానం నేడు విచారించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆదే రోజు(ఏప్రిల్ 10) సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
2018లో విశాఖపట్నం విమానాశ్రయం అప్పడు ప్రతిపక్షనేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస రావు అనే యువకుడు విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు అప్పటినుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇటీవల మరోసారి విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. గతవారంలో ఇదే కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగిన తర్వాత స్వాధీనం చేసుకున్న వస్తువులను చూపించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ సమయంలో వాటిని కోర్టుకు తీసుకురాకపోవడంతో నేడు దాడి కేసులో సీజ్ చేసిన వస్తువులను కోర్టు ముందు ఉంచారు.