అండర్ వరల్డ్ డాన్, ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి ముఠాకు సంబంధించిన వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచి దావూద్ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వారు, షార్ప్ షూటర్లు, డ్రగ్ ట్రాఫికర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇండ్లు, స్థావరాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు.. ముంబయిలోని సుమారు 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దావూద్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘డి’ కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. నాగ్పాడ, గోరెగావ్, బోరివలి, సాంటాక్రూజ్, ముంబ్రా, భిండి బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. ఎన్ఐఏ కేసు ఆధారంగా ఇదే కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నవాబ్కు సంబంధించిన ఎఫ్ఐఆర్లోని చాలా మంది అనుమానితులను కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.