కోయంబత్తూరు కారు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందం దాడులు నిర్వహిస్తోంది. 60 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేసినట్లు సమాచారం.
NIA (National Investigation Agency) conducts raids at multiple locations across Tamil Nadu in connection with the Coimbatore car cylinder blast case: Sources pic.twitter.com/YwsV0AAQ3F
— ANI (@ANI) February 15, 2023
గతేడాది దీపావళికి ఒకరోజు ముందు కోయంబత్తూరులోని సంగమేశ్వర్ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25 ఏళ్ల జమేషా ముబీన్ మరణించాడు. జమేషా తన ఇతర సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. అతని ఇంట్లో భారీగా పేలుడు పదార్థాల నిల్వను పోలీసులు గుర్తించారు. సోదాల్లో కోయంబత్తూరు రైల్వే స్టేషన్, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం, కోయంబత్తూరు కలెక్టరేట్, రేస్ కోర్స్, విక్టోరియా హాల్ మ్యాప్‌లు లభ్యమయ్యాయి. జమేషా ఐఎస్‌ఐఎస్‌తో టచ్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని మంగళూరులో గతేడాది అక్టోబర్‌లో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. ఈ పేలుడులో నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. పలు కేసుల్లో నిందితుడు షరీక్ చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించే బాలల కార్యక్రమాన్ని పేల్చివేయాలని షరీక్ ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలోనే ఐఎస్‌ఐఎస్‌కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.