NIA officials have been conducting searches in many areas of Telugu states
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. ఒక్క జిల్లాలోనే 22 మంది అరెస్ట్

September 18, 2022

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్‌, జగిత్యాల, బైంసాతో పాటు ఏపీలోని కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలపై ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు.

నిజామాబాద్‌లో ఛారిటీ పేరుతో ఫండ్స్ వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారన్న కారణంతో సయ్యద్ షాహిద్‌కు ఎన్ఐఏ నోటీసులు అందించింది. గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు.. ఈ నెల 19న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. నిజామాబాద్‌లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో బైంసాకు వచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లతో పాటు టవర్‌ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్‌, టీఆర్‌ నగర్‌లో ఒక ఇంటిలో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు నిర్వహించి డైరీలు, పలుపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్‌లోనూ ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఇలియాజ్‌తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో ఎన్‌ఐఏ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.