హైకోర్టు లాయర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. నక్సల్స్ రిక్రూట్‌మెంట్ అంటూ .. - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టు లాయర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. నక్సల్స్ రిక్రూట్‌మెంట్ అంటూ ..

June 23, 2022

ఎన్ఐఏ అధికారులు గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలో మూడేళ్ల కింద కనిపించకుండా పోయిన నర్సింగ్ స్టూడెంట్ రాధను నక్సల్స్‌లో చేర్చారని శిల్పపై అభియోగం. అక్కడ మిస్సింగ్ కేసుగా ఉండగా, దాని దర్యాప్తును ఏన్ఐఏకి అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు, శిల్పను అదుపులోకి తీసుకొని విచారణ కోసం మాదాపూర్‌లోని సంస్థ కార్యాలయానికి తరలించారు. 2017లో తన కూతురిని కిడ్నాప్ చేసి బలవంతంగా నక్సల్స్‌లో చేర్చారంటూ రాధ తల్లి కేసు పెట్టింది. అప్పట్లో తన ఇంటికి సీఎంఎస్ నాయకులు, దేవేంద్ర, స్వప్న, న్యాయవాది శిల్పలు తరచూ వచ్చేవారని, వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ పరిణామంపై శిల్ప భర్త బండి కిరణ్ స్పందించారు. ‘మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేశారు. శిల్ప ఇప్పుడు చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నాం. నక్సల్ ముద్ర వేస్తున్నారనే శిల్ప ఆ సంఘం నుంచి బయటికి వచ్చింది. గతంలో కూడా అర్బన్ నక్సలైటు పేరుతో శిల్పను ఆరు నెలలు జైల్లో వేశారు. రాధ తప్పిపోయిన కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ వివరించారు.