అంద‌రి క‌థ‌ - MicTv.in - Telugu News
mictv telugu

అంద‌రి క‌థ‌

March 23, 2018

ప్ర‌స్తుతం న‌వ‌త‌రం ద‌ర్శ‌కులంతా క‌థాంశాల ఎంపిక‌లో భిన్నంగా అడుగులు వేస్తున్నారు. వాణిజ్య‌ హంగులున్న క‌థ‌ల జోలికి పోకుండా మాన‌వ జీవితాల్లోని సంఘ‌ర్ష‌ణ‌ను, వాస్త‌విక ప‌రిస్థితుల్ని, సహజత్వ అంశాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెర‌కెక్కించి ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నారు. సందేశాల్ని అర్థ‌వంతంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో జ‌న‌రంజ‌కంగా చెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల అదే ప్ర‌య‌త్నం చేశారు.

డ‌బ్బు ఉండ‌టంలోను సుఖం ఉంటుంది. లేక‌పోవ‌డంలో సుఖం ఉంటుంది. కానీ డ‌బ్బు పేరుప్ర‌తిష్టాల‌తో నిమిత్తం లేకుండా జీవితంలో సంతోషంగా ఉండ‌టం ముఖ్య‌మ‌ని మ్యూజింగ్స్‌లో గుడిపాటి వెంక‌ట‌చ‌లం చెప్పిన మాట ఆధారంగా చేసుకుని  ఈ సినిమాను తెర‌కెక్కించారు. మ‌నిషి న‌చ్చిన‌ట్లు బ‌త‌కడం కాకుండా బంధుత్వాలు, స‌మాజ‌పు చట్రంలో ఇరుక్కొని ఎలాంటి ఆత్మ‌వంచ‌న‌కు గుర‌వుతున్నాడ‌నే అంశాన్ని అర్థ‌వంతంగా నీదీ నాదీ ఒకే క‌థ ద్వారా చెప్పి త‌న ప్ర‌త్యేక‌త‌ను నిరూపించుకున్నారు వేణు ఊడుగుల‌. క‌థాబ‌ల‌మున్న మంచి సినిమా ఇది. నిత్య జీవితంలో మ‌న‌కు తార‌సిల్లే యువ‌తీయువ‌కుల అంద‌రి క‌థ‌ను ఆలోచాన‌త్మ‌కంగా తెర‌పై చూపించారు. చ‌దువులు, ఉద్యోగాలు, జీవితం స్థిర‌ప‌డే క్ర‌మంలో ప్ర‌తి ఒక్కరి మ‌న‌సులో నిక్షిప్త‌మైన జ్ఞ‌ప‌కాల్ని త‌ట్టిలేపింది. మ‌న‌ల్ని మ‌న‌కే కొత్త‌గా ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. కొత్త‌గా త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌ని ఎదురుచూసే వారంద‌రికి ఈ సినిమా స్ఫూర్తిగా నిలుస్తుంది. కొత్త‌ద‌నంతో కూడిన క‌థాంశాల‌తో మ‌రిన్ని సినిమాలు రావ‌డానికి నాందిగా నిలిచింది.

 

రుద్ర‌రాజు సాగ‌ర్‌(శ్రీ‌విష్ణు) డిగ్రీ పాస్ కావ‌డానికి నానాతంటాలు ప‌డుతుంటాడు. చ‌దువు అత‌డికి ఒంట‌బ‌ట్ట‌క‌పోవ‌డంతో అత‌డి ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌వు. అత‌డి తండ్రి రుద్ర‌రాజు దేవీప్ర‌సాద్(దేవీప్ర‌సాద్‌) ఉపాధ్యాయుడు. ఉత్త‌మ గురువుగా నాలుగు సార్లు అవార్డును అందుకుంటాడు. కొడుకును విధ్యాధికుడిగా చూడాల‌న్న‌ది అత‌డి క‌ల‌. యూనివ‌ర్సిటీ ఫ‌స్ట్ ర్యాంక‌ర్‌గా త‌న కొడుకు నిల‌వాల‌ని అనుకుంటాడు. కానీ సాగ‌ర్ మాత్రం పాస్ కావ‌డానికే నానా తిప్పలు ప‌డుతుంటాడు. తండ్రికి న‌చ్చిన‌ట్లు న‌డుచుకోవ‌డానికి చ‌దువుపై దృష్టిసారించాల‌ని సాగర్ ఎన్నో మార్గాల‌ను అనుస‌రిస్తాడు. ఎంత చ‌దివినా అత‌డి బుర్ర‌కెక్క‌దు. అదే కాల‌నీలో ఉండే ధార్మిక(సాట్నా టైట‌స్‌) చ‌దువులో చిన్న‌త‌నం నుంచే నంబ‌ర్‌వ‌న్‌. దాంతో డిగ్రీ పాస్ కావడానికి త‌న‌కో దారి చూపించ‌మ‌ని సాగ‌ర్ ఆమెను ఆశ్ర‌యిస్తాడు. ఆమె మాట ప్ర‌కారం త‌న అల‌వాట్ల‌ను మార్చుకుంటాడు. వ్య‌క్తిత్వ‌వికాసం పుస్త‌కాలు ద్వారా ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించుకోవాల‌ని అనుకుంటాడు. కానీ అవేవీ చ‌దువుకు ఉప‌యోగ‌ప‌డ‌వ‌నే విష‌యం ఆ త‌ర్వాత అత‌డికి ఆర్థ‌మ‌వుతుంది. చ‌దువు ఒక్క‌టే జీవితం కాద‌ని న‌చ్చిన ప‌ని చేసుకోవ‌డంలోనూ ఆనందం ఇమిడి వుంటుంద‌ని తెలుసుకుంటాడు. అదే విష‌యాన్ని త‌న తండ్రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అత‌డి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా సాగ‌ర్‌ నిర్ణ‌యాన్ని అత‌డి తండ్రిహ‌ర్షించాడా? చ‌దువు పేరుతో చిన్న చిన్న ఆనందాల‌కు దూర‌మై స్వేచ్ఛ‌ను కోల్పోయినా ధార్మిక జీవితం సాగ‌ర్ ప‌రిచ‌యంతో ఎలాంటి మ‌లుపు తిరిగింది చివ‌ర‌కు బ‌త‌క‌డానికి సాగ‌ర్ ఎంచుకున్న దారేది అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

స్వేచ్ఛ, ఆనందాలే ముఖ్యం..

డ‌బ్బు, ప‌రువు ప్ర‌తిష్ట‌ల కంటే జీవితానికి స్వేచ్ఛ‌, ఆనందాలే ముఖ్య‌మ‌నే పాయింట్‌తో రూపొందిన చిత్ర‌మిది. చాలా మంది తండ్రులు చ‌దువుల పేరిట త‌మ పిల్ల‌ల‌ను నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం చేస్తున్నారు. బాల్యంలోనే ఐఐటీ, ఇంజ‌నీరింగ్‌, డాక్ట‌ర్లు అంటూ వారి స్వేచ్ఛాస్వాతంత్యాల‌ను హ‌రిస్తున్నారు. ఆనందోత్సాహాల మ‌ధ్య గడ‌వాల్సిన నేటి విద్యార్థుల జీవితాలు ర్యాంకులు, ప‌రీక్ష‌లు, సెటిల్ మెంట్స్‌ మ‌ధ్య ఒత్తిడుల‌తో సాగుతున్నాయి. ఆశ‌యాల‌కు అనుగుణంగా వారి జీవితాలు సాగ‌క‌పోతే త‌ల్లిదండ్రుల‌తో పాటు స‌మాజం వారిని ఎందుకూ ప‌నికిరానివారి చూస్తుంటుంది. ఇలా ప్ర‌స్తుతం స‌మాజంలో న‌వ‌త‌రం ఎదుర్కొంటున్న సంఘ‌ర్ష‌ణ‌కు అద్ధం ప‌డుతూ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఆద్యంతం హృద్యంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. త‌ల్లిదండ్రుల కోర్కెల‌కు త‌మ క‌ల‌ల‌కు మ‌ధ్య న‌లిగిపోతున్న విద్యార్థుల జీవితాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా సినిమాలో చూపించారు. ఇష్టంలేని చ‌దువులు, ఉద్యోగాల పేరుతో జీవితాన్ని వెళ్ల‌దీస్తున్న యువ‌త‌రం వ్య‌థ‌ల‌ను, వ్య‌క్తిత్వ వికాసం పేరుతో విద్యార్థులపై త‌మ సొంత అభిప్రాయాల్ని బ‌లంగా రుద్దుతున్న సంస్థ‌లు, పుస్త‌క ర‌చ‌యిత‌ల‌పై తీరును ఎండ‌గ‌ట్టిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా త‌న మ‌న‌సులోని అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా చెప్ప‌నీయ‌కుండా అడ్డుకుంటూ వారి మ‌న‌స్త‌త్వాల‌తో అవి ఏ విధంగా ఆడుకుంటున్నాయో చ‌క్క‌గా చూపించారు. ఇలా ఆద్యంతం ఆలోచ‌న‌న‌ను రేకెత్తించేలా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు.

నేటి స‌మాజానికి అవ‌స‌ర‌మైన మంచి పాయింట్‌ను ఎంచుకుని సినిమాను చేయాల‌నే ద‌ర్శ‌కుడి సంక‌ల్పం నిజంగా అభినంద‌నీయం. క‌థ‌గా తాను రాసుకున్న అంశాన్ని వంద‌శాతం తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో పూర్తిగా ద‌ర్శ‌కుడు స‌ఫ‌లీకృతుడ‌య్యాడ‌నే చెప్పాలి. తాను చెప్ప‌ద‌లుచుకున్న అంశాన్ని ఎక్క‌డ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఆద్యంతం హృద‌యాల్ని హ‌త్తుకునేలా చూపించారు. స‌గ‌టు మ‌నిషి ఆవేద‌న‌ను, ఆలోచ‌న‌ల్ని తాను రాసుకున్న పాత్ర‌ల ద్వారా అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల మ‌న‌స్త‌త్వాల‌ను, తండ్రీ కొడుకుల అనుబంధాన్ని స‌హ‌జంగా చూపించ‌డంలో వంద‌శాతం స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. మూస‌ధోర‌ణికి భిన్నంగా ప్ర‌తి ఫ్రేమ్‌లో కొత్త‌ద‌నాన్ని చూపించారు. ఈ సినిమాతో వేణు ఊడుగుల రూపంలో మ‌రో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయ‌మ‌య్యాడు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవితాల్ని తెర‌పై చూసుకునేలా చేశారు.

అంద‌రికి తెలిసిన క‌థ‌నే అయినా ఎక్క‌డ బోర్ కొట్ట‌కుండా చూపించాడు. సందేశాత్మ‌క క‌థాంశాల్లో వినోదాన్ని మిళితం చేయ‌డం ఒక‌ర‌కంగా క‌త్తిమీద సాము లాంటిది. కానీ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ప్ర‌తి స‌న్నివేశంలో అంత‌ర్లీనంగా వినోదానికి చోటు క‌ల్పిస్తూనే త‌న అనుకున్న పాయింట్‌ను చెప్పారు.

త‌న‌కు ఇష్టంలేక‌పోయినా తండ్రి కోసం న‌చ్చ‌ని ప‌ని చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన ఓ యువ‌కుడికి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయో వినోదాన్ని మిళితం చేస్తూ భావోద్వేగ ప్ర‌ధానంగా ఆవిష్క‌రించిన తీరు బాగుంది. మ‌న‌కు న‌చ్చిన‌ట్లు బ‌త‌క‌నీయ‌కుండా చుట్టుప‌క్క‌ల ఉన్న వ్య‌క్తులు, స‌మాజం ఎలా అడ్డుప‌డుతుందో అర్థ‌వంతంగా చెప్పారు. మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబిస్తూ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ మేళ‌వింపుతో చ‌క్క‌టి సందేశాత్మ‌క చిత్రంగా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. వంద‌కు వంద రాలేద‌ని ప్ర‌స్తుతం విద్యార్థీని విద్యార్థులు బాధ‌ప‌డ‌టం, ఫ‌లితాల రోజు వారు అనుభ‌వించే మాన‌సిక ఒత్తిడి ఇలా ప్ర‌తి స‌న్నివేశాన్ని స‌హ‌జంగా తెర‌కెక్కించారు. ఆ స‌న్నివేశాల‌న్నీ నిజంగా క‌ళ్ల‌ముందు జ‌రుగుతున్న అనుభూతి క‌లుగుతుంది.

శ్రీ‌విష్ణు, దేవీప్ర‌సాద్ మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం సినిమాను నిల‌బెట్టింది కొడుకు ప్రాణం కంటే త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లే ముఖ్య‌మ‌ని ఆలోచించే తండ్రి, తండ్రికి న‌చ్చిన‌ట్లు న‌డ‌చుకోవ‌డానికి త‌ప‌న ప‌డే కొడుకుగా వారిద్ధ‌రి మ‌ధ్య భావోద్వేగాలు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. క‌ల‌ల‌కు వాస్త‌వానికి మ‌ధ్య న‌లిగిపోయే స‌గ‌టు యువ‌కుడి పాత్ర‌కు శ్రీ‌విష్ణు పూర్తిగా న్యాయం చేశారు. ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. అత‌డిలోని న‌ట‌న ప్ర‌తిభ‌ను ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. త‌న అభిప్రాయాల్ని స్ప‌ష్టంగా తండ్రికి చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌య్యే స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా అత‌డి న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా ప‌తాక ఘ‌ట్టాల్లో భావోద్వేగాల‌ను ప‌లికించిన తీరు బాగుంది. తండ్రి పాత్ర‌కు దేవీప్ర‌సాద్ ప్రాణం పోశారు. త‌న‌లో మంచి న‌టుడు ఉన్నాడ‌ని నిరూపించుకున్నారు. ధార్మికగా బిచ్చ‌గాడు ఫేమ్ సాట్న టైట‌స్‌కు మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. మిగ‌తా పాత్ర‌ధారులంతా స‌హ జ న‌ట‌న‌తో మెప్పించారు.

డోగ్మా-95 అనే విధానంలో ఈసినిమాను తెర‌కెక్కించారు. ఈ ప‌ద్ద‌తిలో రూపొందిన తొలి తెలుగు సినిమా ఇదే. భారీ సెట్స్‌, హీరోయిజాలు, పోరాట ఘ‌ట్టాల‌కు, హింసాయుత దృశ్యాల‌కు తావు లేకుండా నిజ‌మైన లొకేష‌న్ లో వాస్త‌విక‌త‌కు పెద్ద‌పీట వేస్తూ సినిమాను రూపొందించ‌డం కొత్త శోభ‌ను సంత‌రించిపెట్టింది. క‌థ‌కు బలాన్ని ఇచ్చింది. హీరోలు, హీరోయిన్ల‌ను కాకుండా క‌ళ్ల‌ముందు య‌దార్థంగా జీవితాల్ని చూస్తున్న అనుభూతిని క‌లిగించింది. చిత్రీక‌ర‌ణ కోసం ఎంచుకున్న లొకేష‌న్స్ అన్ని మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అద్ధంప‌ట్టాయి. మంచి క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే నిర్మాత‌లు, కృష్ణ‌విజ‌య్‌, అట్లూరి నారాయ‌ణ‌రావు ప్ర‌య‌త్నం నిజంగా అభినంద‌నీయం. ఇలాంటి క‌థాబ‌ల‌మున్న సినిమాను నిర్మించ‌డానికి ఎంతో ధైర్యం కావాలి. క‌మ‌ర్షియ‌ల్ లాభాలు, మార్కెట్ లెక్క‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ద‌ర్శ‌కుడు పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ ఈసినిమాను రూపొందించారు.

క‌థ‌, క‌థ‌నాల‌తో పాటుసంభాష‌ణ‌ల్ని చ‌క్క‌గా రాశారు వేణు ఊడుగుల. ప్ర‌తి డైలాగ్ స‌మాజాన్ని ప్ర‌శిస్తున్న‌ట్లుగా ఉంటుంది. పంచ్‌లు, ప్రాస‌ల జోలికి పోకుండా రాయ‌ల‌సీమ‌, తెలంగాణ యాస‌ల‌లోని మాధుర్యాన్ని ఆవిష్క‌రిస్తూ అందంగా రాశారు. అలాగే తెలంగాణ సంస్కృతికి ప్ర‌తిబింబించే ఒగ్గుక‌థ సంప్ర‌దాయాన్ని పాట రూపంలో చూపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి బాణీలు, నేప‌థ్య సంగీతం బాగున్నాయి. క‌థ‌లోని ఫీల్‌ను బ‌లంగా తెర‌పై చూపించ‌డానికి దోహ‌దం చేశాయి.

నీది నాది ఒకే క‌థ స‌మాజానికి ఉప‌యుక్త‌మైన ఓ మంచి సినిమా. నేటి విద్యావ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల్ని, స‌మాజ‌పు తీరును, యువ‌త‌రం ఎదుర్కొంటున్న మాన‌సిక క్షోభ‌ను చ‌క్క‌గా చూపించిన మంచి సందేశాత్మ‌క చిత్ర‌మిది. నిజాయితీతో కూడిన న‌వ్య‌మైన‌ ప్ర‌య‌త్నంగా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ఇచ్చిన‌ట్లుగా ఇలాంటి క‌థాబ‌ల‌మున్న మంచి చిత్రాల‌కు రేటింగ్ ఇచ్చి దాని ఔన్న‌త్యాన్ని త‌గ్గించ‌డం స‌మంజ‌సం కాదు. ప్ర‌తి త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు క‌లిసి చూడాల్సిన చ‌క్క‌టి సినిమా ఇది. మూస‌ధోర‌ణితో కూడిన సినిమాల‌కు అల‌వాటు ప‌డిన ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం త‌ర్వాత క‌థాబ‌ల‌మున్న మంచి సినిమా చూశామ‌నే తృప్తితో థియేట‌ర్ నుంచి బ‌య‌ట అడుగుపెడ‌తార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.