Nikhat, who showed his strength in the Commonwealth, praises Modi and KCR
mictv telugu

కామన్వెల్త్‌‌లో సత్తా చాటిన నిఖత్..మోదీ,కేసీఆర్ ప్రశంసలు

August 8, 2022

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఇందురూకు చెందిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటింది. అత్యుత్తమ మహిళా బాక్సర్ తానే అని మరోసారి చాటి చెప్పింది. కామన్వెల్త్ క్రీడల 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్లో నిఖత్ 5-0తో కార్లీ మెకల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తు చేసి, స్వర్ణం సాధించింది.

నిఖత్..ఫైనల్ బౌట్లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ, కార్లీపై అదను చూసి పంచ్‌లు కురిపించింది. ఏలాంటి వ్యూహం లేకుండా ప్రత్యర్థి దాడి చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా, నిఖత్ మాత్రం ప్రశాంతంగా పంచ్‌లు విసురుతూ, పాయింట్లు సాధించింది. దాంతో నిఖత్‌ను న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు.

అనంతరం నిఖత్ మాట్లాడుతూ..”మూడు నెలల వ్యవధిలోనే ప్రపంచ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఆకాశంలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల. అలాంటిది అత్యున్నత వేదికల్లో పతకాలు గెలుస్తుండటం చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. కష్టపడుతున్నందుకు ఫలితాలు వస్తున్నాయి. కష్టపడి సాధన చేస్తున్నంత కాలం నన్నెవరూ ఆపలేరు. భవిష్యత్తులోనూ దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా. మరింత బరువు తగ్గించుకుని విభాగాన్ని మార్చుకుంటా.” అని అన్నారు.

మరోపక్క నిఖత్ జరీన్‌ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్‌.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని అన్నారు. అనంతరం నిఖత్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైందని, నిఖత్‌..తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.