nikhat-zareen-2-times-world-champion-creates-history
mictv telugu

పంచ్ పడిందంటే స్వర్ణాలు మెడలో పడాల్సిందే

March 27, 2023

nikhat-zareen-2-times-world-champion-creates-history

నిఖత్ జరీన్…నిన్నటి నుంచి ఈ పేరు మారుమోగిపోతోంది. రెండుసార్లు విశ్వ విజేతగా నిలిచిన నికల్ జరీన్ మన తెలుగు అమ్మాయి. తెలంగాణ వాసి. ఏ హైప్ లేకుండా….కామ్ గా వచ్చి ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకున్న అమ్మాయి. ఏదో వచ్చింది కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుందిలే అనుకున్నారు. కానీ అలాంటి రకం కాదు తాను నిరూపించుకుని ప్రపంచ బాక్సర్లకు సవాల్ విసురుతోంది. ఉత్తరాది వారి పోటీని తట్టుకుని….వారిని దాటుకుని దూసుకెళ్ళిపోతోంది.

ప్రపంచ విజేతగా నిలబడాలి అంటే ముందు మన బాక్సర్లను కూడా గెలవాలి. మేరికోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఆమెనే సవాల్ చేస్తోంది…ఎంత ధైర్య అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచీ సవాళ్ళను ఎదుర్కొన్న గుండె ఆమెది. ఆటుపోట్లకు రాటుతేలిన పంచ్ అది. కానీ అన్నింటినీ అధిగమించి రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది నికత్. మేరికోమ్ బాటలో దూసుకుపోతోంది. ఆమె తర్వాత వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఒకటి కంటే ఎక్కువ పతకాల సాధించినవారి జాబితాలో చేరింది. 2021 నుంచి నికత్ ఒక్క బౌట్ కూడా ఓడిపోకుండా ఆడుతూ వస్తోంది. ఈ రెడేళ్ళల్లోనే రెండు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. కామన్వెల్త్, స్ట్రాంజా స్మారక్ బాక్సింగ్ టోర్నీ, సెలక్షన్ ట్రయల్స్…ఒకటేమిటీ అన్నింటిలోనూ నికత్ దే పై చేయి.గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ తెలంగాణ బాక్సర్ నెక్స్ట్ టార్గెట్ ఒలింపిక్స్.

వెయిట్ సవాల్:

లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ తర్వాత నిఖత్ కు వెయిట్ ప్రాబ్లెమ్ గా మారింది. తాను ఎప్పుడూ పోటీ చేసే 54 కేజీల విబాగంలో కాకుండా 50 కేజీల దానిలో ఆడవల్సి వచ్చింది. దాని కోసం విపరీతంగా శ్రమ పడింది. జాన్ వార్ బర్టన్ కోచింగ్ లో 50 కేజీల విభాగంలో రాటుదేలింది. అదే విభాగంలో ముందు కామన్వెల్త్ లో గెలిచింది. ఆ గెలుపు ఇచ్చిన విశ్వాసంతో ఇప్పుడు జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో కూడా సునాయంగా విజయం సాధించింది.

తెలంగాణ బిడ్డ:

తెలంగాణ లో నిజామాబాద్ లోని ఇందూరుకు చెందిన నిఖత్ జరీన్ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్.. ఈ స్థాయికి చేరడం వెనుక చాలా ఏళ్ళశ్రమ దాగి ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాల కూతురు జరీన్. నిఖత్‌ జరీన్‌ 1996 జూన్‌ 14న జన్మించింది. పొట్టకూటి కోసం జమీల్ గల్ఫ్ లో కొన్నాళ్ళు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏళ్ళ వయసులో తన ఈడు పిల్లలంతా వీధుల వెంబడి ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని నిర్మల హృదయ హైస్కూల్‌లో చదివిన ఆమె కాకతీయ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసింది. 15 ఏళ్ళ వయస్సులోనే బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆమెకు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది.

నిజామాబాద్లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా చాలా టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే తమిళనాడులోని ఈరోడ్ లో జరిగిన నేషనల్ ఛాంపియన్స్ లో గోల్డెన్ బెస్ట్ బాక్సర్ అవార్డు పొందింది.

ఎక్కడ బాక్సింగ్‌ పోటీలు జరిగినా..

2011లో జరిగి ఉమెన్స్‌ యూత్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కడ బాక్సింగ్‌ పోటీలు జరిగినా కచ్చితంగా పతకం ఒడిసి పట్టుకోవడం అలవాటుగా చేసుకుంది. బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించింది.
2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం,2018 లో బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి, 2018లో హరియాణాలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం,2019లో ఇండియా ఓపెన్‌లో కాంస్యం,2019లో ఆసియా చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)‌లో రజతం, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో రజతం,2019లో 70వ ఎడిషన్ స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నమెంట్‌ (బల్గేరియా)లో స్వర్ణం,2021లో ఇస్తాంబుల్ టోర్నమెంట్‌లో కాంస్యం2022లో 73వ ఎడిషన్ స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ (బల్గేరియా) లో స్వర్ణం గెలుచుకుంది.

నెక్స్ట్ ఇయర్ పారిస్ లో జరిగే ఒలింపిక్సే ఇప్పుడు నిఖత్ జరీన్ లక్ష్యం. తాజా విజయంతో ఈ కేటగిరిలో దాదాపు తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. నిఖత్ ఇలానే తన ఆటను కొనసాగిస్తే ఒలింపిక్ పతకం కచ్చితం అంటున్నారు.