మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ బాక్సర్లు సత్తా చాటారు. తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ (50 కేజీలు విభాగంలో)తో పాటు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీల విభాగంలో) ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, నిఖత్.. కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలెన్సియాను పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో 2023లో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ చెలరేగి ఆడుతోంది. ప్రతి మ్యాచ్‌లోను తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. గత ఆదివారం రెండో రౌండ్‌లో ఆఫ్రికా ఛాంపియన్ బోలమ్ రుమేసా (అల్జీరియా)పైన, మంగళవారం ప్రీక్వార్టర్స్‌లో మెక్సికో బాక్సర్ పాట్రీషియా అల్వారెజ్‌పైన కూడా నిఖత్ దూకుడు ప్రదర్శించి 5-0 తేడాతో విజయాలు సాధించింది.