స్టోరీ @ తెలుగు సినిమా !
స్టోరీ
బేసిక్ గా కథ అంటే ఏంటీ ? కథ చదివినా, దాన్ని చలన చిత్రంగా చూసినా అది చదివిన పాఠకుణ్ని, చూసిన ప్రేక్షకుణ్ని మెస్మరైజ్ చెయ్యాలి, మెప్పించాలి, మెసేజ్ ఇవ్వాలి.., ఇదీ స్థూలంగా కథ రాసేటప్పుడు రచయితలు పాటించే సిద్ధాంతం. కథ కదిలించాలి, అంతరాన్ని అతలాకుతలం చెయ్యాలి, వెంటాడాలి, వెన్ను తట్టి అతనిలో గొప్ప మార్పుకు నాంది పలకాలి.., ఇన్నున్నాయి కథ వెనుక పరుగెత్తుకొచ్చే పరిణామాలు. కథకు కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితులకు లోబడి కథలు రాయాలి. కథ ఒక చంటి పిల్లాడిలాంటిది. ముద్దుగా, జాగ్రత్తగా ఎత్తుకొని, మురిపెంగా నడిచి, అంతే లాలనగా కింద దించడమే కథ తీరు. ప్రారంభం, నడక, ముగింపులు హృదయానికి ఆకట్టుకొని, దాంట్లోనే తిష్ట వెయ్యగలగాలి.
ఊహాత్మకంగా పుట్టే కథలు, నిజ జీవితంలోంచి పుట్టే కథలు ఇలా కథలు రెండు రకాలుగా పుట్టి ఆరు రసాల్లోంచి ఏదో ఒక రసాన్ని పులుముకుంటాయి. అయితే సినిమా కథకు వచ్చేసరికి కొన్ని సిద్ధాంతాలను దాటిపోయింది. అదేమిటంటే.. అన్నీ రసాలను అవసరం లేకపోయినా ఒకేదాంట్లో గుదిగుచ్చేస్తారు. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా కథ తన పరిధిని పరిధులు దాటి విస్తృతం చేస్కుందనే చెప్పాలి. కమర్షియల్ అంశాలు ఏ ప్రాంతీయ భాషా సినిమాకు తగలని విధంగా మన తెలుగు సినిమాకు తెగుళ్ళలా అంటుకున్నది ? కమర్షియల్ అంశాలు తెలుగు సినిమాను ఏ విధంగా ప్రభావితం చేసాయి ? కథను ఏ విధంగా శాసించాయి ? తదనుగుణంగా కథ తన వాస్తవ రూపాలను దాటి ఏ తీరాలకు చేరుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన క్శశ్చన్ ??
మన వాళ్ళ తీరు
మన తెలుగు సినిమా పెద్దమనుషులు కొంత డోలాయమానంలో వుంటారని ప్రతిసారి రుజువు అవుతున్నది. ఎలా అంటారా ? పక్కవాడు తన ఒంటికి బూడిద పూసుకొని మెరిసిపోతున్నాడని మన వాళ్ళు కూడా ఆ బూడిదను పూసుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ కుచ్ హట్కే సోంచేంగే, అలగ్ సె ఫిల్మ్ బనాయేంగే అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఆఫీసుల్లో చల్లగా కూర్చొని వాళ్ళ దగ్గరికొచ్చే అప్ కమింగ్ డైరెక్టర్ల కథలను విని పెదవి విరుస్తుంటారు. ఇది కాదయ్య కథ తీరు ? ఇందులో హీరోయిజం ఎక్కడుంది ? బిల్డప్ షాట్స్ ఎక్కడున్నాయి ? హీరోయిన్ గ్లామరేది ? అని అతని క్రియేటివిటీని నాశనం పట్టించడంలో మనవాళ్ళ తీరు వర్ణనాతీతంగా వుంటుంది.
కాస్త కొత్తగా ఆలోచించండయ్యా అని వారికి హిత బోధ చేసి పంపుతారు. తుస్సుమంటాడు డైరెక్టర్ ? అప్పుడతను బాగున్న తన కథకు పానలు, స్ర్కూడ్రైవర్ లు పట్టుకొని రిపేర్ చెయ్యడం ప్రారంభిస్తాడు. మనవాళ్లు మారరా ? కథల మీద వాళ్ళు ఎప్పటికీ సరైన డెసీషన్ తీస్కోలేరా ? ఏమో.. కమర్షియాలిటీ నిండా నిండుకున్నాక క్రియేటివిటీ దానికి అమ్ముడుపోతుందేమో !? కొత్త కథలు పట్టుకొని ఎంతమంది అప్ కమింగ్ డైరెక్టర్లు నిర్మాతల చుట్టూ తిరిగినా వాళ్ళకు ఓ పట్టాన నచ్చవు కథలు. మనవాళ్లకు కథలు ఎందుకు నచ్చవు ?
సైరాత్ సైర
ఆ మధ్య మరాఠీలో వచ్చిన ‘ సైరాట్ ’ సినిమా అద్భుతమైన హిట్టు కొట్టిందని మనందరికీ తెల్సిందే. ఆ సినిమా పడుకున్న మన వాళ్ళకు మేలుకొలుపు సైర చేసిందనే చెప్పుకోవాలి. ఆ సినిమా డైరెక్టర్ నాగ్రాజ్ పొపట్రావ్ మంజూలేలా మనం ఎప్పటికీ ఆలోచించలేమా అన్నంత ఇన్ ఫియారిటీ కంప్లెక్స్ కు లోనయ్యారు మనవాళ్లు ? కానీ.. నాగ్రాజ్ మాత్రం తననుతానే నమ్ముకొని కథ రాస్కున్నాడు, సినిమా తీసి హిట్టు కొట్టాడు అంతే. అయితే మనవాళ్ళకు హిట్టైన సినిమా గురించి తెగ పూనకాలు వచ్చేస్తుంటాయి. ఇంక ఆ సినిమా గురించే చర్చల మీద చర్చలు కొనసాగిస్తుంటారు. కానీ సైరాట్ ను మించి కొత్తగా మనమేమన్నా ట్రై చేద్దామా అని అస్సలు అనుకోరెందుకో ? ఒకవేళ వచ్చినా.. వాళ్ళను తెలివిహీనంగా రిజెక్టు చేసేస్తారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా వచ్చి టోటల్ ఇండియాను షేక్ చేసి నంబర్ వన్ హిట్టు సినిమాగా నిలిచింది సైరాట్..
సైరాత్ కథ రొటీన్ ప్లస్ కమర్షియల్ అంశాలున్న సినిమానే కానీ సూపర్ డూపర్ హిట్టైంది. ఎందుకూ.. దర్శకుడు తను నమ్మిన కథను డేర్ గా తీసాడు గనక. అందుకే డైరెక్టర్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలబడ్డాడు. అతను అంతకు ముందు చేసిన ‘ ఫండ్రీ ’ సినిమా కానివ్వండి అదొక ట్రైబల్ ఏరియాలోని కథ. దాన్ని గనక మనవాళ్ళకు చెప్పుంటే చెప్పిన డైరెక్టర్ ను కింది నుండి మీది వరకు చూసి మనం 2017 లో వున్నాం 1960 లో లేము అని మహా తెలివిగలవాళ్లుగా జవాబు చెప్పి పంపించేసేవారు. సైరాట్ సినిమా కథ ఎన్ని కథలకు ఇన్స్పిరేషన్ గా మారిందో. చాలా మంది మనవాళ్ళు ఆ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీస్కొని కొత్త కథలను తయారు చేసే పనిలో లీనమయ్యారు తప్ప కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని అస్సలు ఆలోచించట్లేదు.
మనవాళ్ళది రమర్షియల్ మైండా ?
యస్.. హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ మాట. మన దర్శక, నిర్మాతలది పక్కా కమర్షియల్ మైండు. కథలో ఫస్ట్ ఫస్టే హీరో ఇంట్రడక్షన్ ఇలా అదిరిపోయేలా చాలా బల్డప్ గా వుండాలి, హీరో లుక్ నాటుగా వుండాలి, ఒక ఐటం సాంగు, ఇంట్రవల్ బ్యాంగ్ మాంచి ట్విస్టుతో వుండాలి, ప్రీ క్లైమాక్స్ లో నారాలు తెగిపోయే సస్పెన్సు, పంచ్ డైలాగులు, కథకు సంబంధం లేని కామెడీ ట్రాకులు, క్లైమాక్స్ లో వీరోచిత ఫైటింగులుండాలి.., స్థూలంగా ఇదీ మనవాళ్ళ కమర్షియల్ సినిమా మైండు. నిర్మాత అనేవాడు నాలుగు పైసలు పెట్టి పది పైసలు సంపాదించుకోవాలనుకోవడం సహజం. కానీ ఆ సిద్ధాంతం సినిమా ఫీల్డుకు అస్సలు అప్లై కాదు. ఎందుకంటే బిజినెస్ తో పాటు విలువలు ముడిపడివున్న ఫీల్డు ఇది గనక. కానీ మనవాళ్ళు ఫక్తు కమర్షియల్ గానే ఆలోచించి కథలను ఖూనీ చేసేస్తుంటారు. ఈ కమర్షియాలిటీ అన్న ఒకే ఒక్క పదం తెలుగు సినిమాను నేషనల్ స్థాయికి తీసుకెళ్ళలేకపోతోందనే చెప్పుకోవాలి. అడపా దడపా నా బంగారుతల్లి, పెళ్ళి చూపులు సినిమాలు తప్ప రెగ్యులర్ గా మన తెలుగు సినిమాలు ఎందుకు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయంటే కారణం కమర్షియలిజం.
సీనియర్ దర్శకులు అనవసరంగా ప్రయోగాలు చేసి ప్రొడ్యూసర్ కు నష్టాలను ఎందుకు తెచ్చి పెట్టాలి అని ఆ మూస, రొడ్డ కొట్టుడు కథలకు ఎడిక్టైపోయారు. డైరెక్టర్ ను అనిపించుకున్నాను కదా చాలు అనుకునేవారు చాలా ఎక్కువై పోయారు. అటువంటప్పుడు ఇంకెక్కడ్నుంచి వస్తాయి కొత్త కథలు ? రావు.. ఎందుకంటే రుద్దిన కథలనే దుద్ది రుద్ది జనాల మైండును దొబ్బేయటం ఒక పాశవిక చర్యకు పరాకాష్ట గనక !?
తెలుగు ప్రేక్షకులు
మన తెలుగు ప్రేక్షకుల టేస్టు డిఫరెంటప్పా.. వాళ్ళు మాల్ మసాలా ఫుల్లున్న సినిమాలంటేనే పడి చస్తారు, అని ఒక కనపడని మాయను వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసి, దాన్ని ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారు. తమిళంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. వాళ్ళ ప్రాంతీయత్వాన్ని, అస్థిత్వాన్ని ప్రతిబింబించే సినిమాలు అక్కడ పెద్ద హిట్టు అవుతున్నాయి. మరి మన దెగ్గర అలాంటి ప్రయోగాలు ఎందుకు జరగట్లేదు ? ఎందుకంటే మన ప్రేక్షకులకు అలాంటి ప్రయోగాత్మక సినిమాలను ఆదరించేంత బ్రాడ్ మైండ్ లేదని మనవాళ్ళు డిసైడ్ చేస్కున్నారు గనక. మరి తమిళ ప్రేక్షకులు ?
ప్రేక్షకుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడని ఎవ్వరు కూడా ఆలోచించకుండా వారికి నచ్చిన సినిమాలను తీసి మన తెలుగు ప్రేక్షకులను చెడదొబ్బారనే చెప్పుకోవచ్చు. మన హీరోలు సైతం పక్కా మాస్ మసాల కథలనే ఇష్టపడి మరీ సినిమాలు చేస్తున్నారు. ఎందుకు ? ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు ‘ హౌలాలు ’ అని పక్కా ఫిక్స్ అయిపోయారు గనక !? యూట్యూబ్ లో పెట్టిన టీజర్ కి గంటలో ఇరవై లక్షల వీవ్స్ అని చంకలు గుద్దుకుంటున్నారు తప్ప దాని కిందనే వున్న నెగెటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోకపోవడానికి కారణం ఇగ్నోరింగ్. ఆ కామెంట్లను పట్టించుకుంటే మన తెలుగు సినిమాకు మనం కట్టుకున్న గోడ కూల్చుకున్నట్టు అవుతుందని ఎవరి భయం వారిది. మొత్తానికి మన తెలుగు ప్రేక్షకులు నంబరేక్ బక్రాలు మన వాళ్ళ దృష్టిలో !?
పెళ్ళి చూపులు
పెళ్ళి చూపులు సినిమా హిట్టవడంతో కొత్త దర్శకుడు ఏ ప్రొడ్యూసర్ దెగ్గరికెళ్లి కథ చెబుదామన్నా అందరూ ఒకటే మాటన్నారు. అదేమిటంటే పెళ్ళి చూపులు సినిమాలా సింపుల్ గా వుండాలయ్యా కథ అని డిమాండ్లు చేసారు. ఇప్పటికే చాలా సినిమాలు ఆ పెళ్ళి చూపులు ఛాయల్లో నిర్మాణ దశలో వున్నాయి. ఆ చిత్ర దర్శకుడు సినిమాకు ముందు ఆ కథను పట్టుకొని చాలా మంది నిర్మాతలకు వినిపించాడట. అప్పుడందరూ అన్న మాట ఏంటంటే.. కథలో దమ్ము లేదు, ఇంకా ఏమైనా కమర్షియల్ గా బెటర్ మెంటు చేయొచ్చేమో ఆలోచించమని సలహాలిచ్చారట. కానీ తరుణ్ భాస్కర్ ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. తను హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన కథను సినిమాగా తీసాడు హిట్టు కొట్డాడు, టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలబడ్డాడు, అవార్డులు, రివార్డులు పొందాడు. దట్ ఈజ్ ద స్పిరిట్.
నిన్నుకోరి
ఇప్పుడు ఎవరి నోటా విన్నా నిన్నుకోరి సినిమా గురించే వినబడుతోంది. దర్శకుడు శివ నిర్వాణ గురించే హాట్ గా చర్చలు. అబ్బబ్బా ఏం తీసాడ్రా సినిమా అని తెగ పొగిడేస్తున్నారు. నిన్నుకోరిని ఎక్జాంపుల్ గా చూపించి ఇప్పుడొస్తున్న దర్శకులకు కొత్త పాఠాలు చెప్తున్నారు. మంచి కథాబలంతో, చూసనివారికి మంచి ఫీల్ ను పంచుతోందని పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ దర్శకుడు ఈ కథను నానీకి చెప్పి నయం చేసాడు, లేదంటే ఏ బాబు దెగ్గరికో వెళ్ళుంటే ఈ కథ ఇంకోలా వుండేది ? పాపం నానీకి కొన్ని సెన్సిటివ్స్ వున్నాయ్ కాబట్టి అతనైతేనే నా ఈ అద్భుతమైన కథను ఆక్సెప్ట్ చేస్తాడనే నమ్మకంతో దర్శకుడు నానీని హీరోగా చూజ్ చేస్కొని వెళ్ళి ఒప్పించాడు. సినిమా తీసాడు, హిట్టు కొట్టాడు. అదీ లెక్ఖ.. ఇప్పడు ఏ ఆఫీసుకు కథ పట్టుకొని పోయినా ఏంటయ్యా ఈ కథ ? మనం నిన్ను కోరి లా చేద్దాం అలా తయారు చేసుకురాపో అంటారు. తప్ప ఆ వచ్చిన కథ నిన్నుకోరిని మించి హిట్టవుతుందని అస్సలు బిలీవ్ చెయ్యరు. పక్కోడు పానకాన్ని తన ఒంటి మీద గుమ్మరించుకున్నాడని మనం గుమ్మరించుకోవాలనుకునే రకాలు మన తెలుగు సినిమావాళ్ళు !
తెలంగాణ కథలు
ఇప్పుడు తెర మీదకు తెలంగాణ వాదం వచ్చింది. తెలుగు సినిమాలకు కథలు కొరవడ్డాయి. తీసినవే తీసి తీసి డీజేలు బజాయించేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మంచి కథలు, జీవమున్నకథలు కావాలంటే తెలంగాణా సైడు దృష్టి సారించాలని వాళ్ళకు కూడా ఎరుకైపోయింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వాలను ప్రతిబింబించే సినిమాలు రాలేవు గనక ఇక్కడి కథలను సినిమాలుగా తీస్తే ఇరాన్ సినిమా స్థాయిలో తెలంగాణ సినిమా నిలబడుతుందనేది పచ్చి వాస్తవం. ఇంక వాళ్ళు ఆ కమర్షియల్ మైండుతో ఆ పరిధులను దాటి నయా ఏం చెయ్యరు. చేస్తే గీస్తే అవే రొడ్డకొట్టుడు హీరోయిజాలతోనే సినిమాలను తీసి ప్రేక్షకులను పక్కదోవ పట్టిస్తూనే వుంటారు తప్పితే ఒక ఇరానియన్ టైపాఫ్ సినిమా తీయటం వాళ్ళకు అస్సలు చేత కాదు. అలాంటి గొప్ప కథా వస్తువులు మనకు తెలంగాణ మట్టిలో పుష్కలంగా లభిస్తాయి. తెలంగాణా నుండి వస్తున్న అప్ కమింగ్ డైరెక్టర్లు ఇక్కడి కథలతో సినిమాలు తీస్తే తప్పకుండా తెలంగాణ సినిమా మాత్రమే ప్రపంచ స్థాయిలో నిలబడగలదు. బి. నర్సింగ్ రావు సారు తీసిన దాసి, రంగుల కల, శ్యాం బెనగళ్ తీసిన అంకుర్, చిల్లర దేవుళ్ళ వంటి సినిమాల స్థాయిలో మళ్ళీ పునర్వైభవం వస్తుందని కొందరు మేధావుల విశ్లేషణ.
ముగింపు లేని కథ
మంచి కథలకు మనవాళ్ళు ముగింపు పలికారు. కమర్షియల్ కథలతో వాస్తవానికి దూరంగా సినిమాను సాము చేయిస్తున్నారు. జనాల జీవితాల్లోకి తొంగి చూస్తే ప్రాక్టికల్ గా వుండే కథలు చాలా దొరుకుతాయి. ఆ దిశలో అరిగిపోయిన కథలకు ముగింపు పలికి కొత్త కథల వైపు దృష్ఠి సారించాల్సిన అవసరం చాలా వుంది. కథ సినిమాకు ప్రాణం పొయ్యాలి కానీ తియ్యకూడదు. ప్రేక్షకులకు కథలు మంచి ఫీల్ ను ఇవ్వాలి అని ఆలోచించగలిగితే మన కథలు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఖాయం !
- సంఘీర్