బ్యాంకు సొమ్ముల కిందికి చేరుతున్న ‘నీరు’వ్‌లు! - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకు సొమ్ముల కిందికి చేరుతున్న ‘నీరు’వ్‌లు!

February 20, 2018

11 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం వెనుక సూత్రధారిగా ఆరోపణ ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ ఒక మిలియనీర్ బిజినెస్ మాన్. ఈ స్కాం విషయంలో కాంగ్రెస్ బీజేపీని,  బీజేపీ కాంగ్రెస్ పార్టీను పరస్పరం నిందించుకుంటున్నాయి.  

అసలు నిజానిజాలు ఏమిటి?

ఃనీరవ్ మోడీ ఒక వజ్రాల వ్యాపారి. సీబీఐ చెప్తున్న దాన్ని బట్టి అతను పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఇచ్చినట్టుగా నకిలీ హామీపత్రాలను(లెటర్ అఫ్ అండర్‌టేకింగ్) చూపించి పెద్ద మొత్తంలో విదేశీ బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో అప్పులు తీసుకున్నాడు. అసలు ఈ ఎల్ఓయూ అంటే ఏమిటి?   నిజానికి ఇదొక హామీ  పత్రం లాంటిది. తీసుకున్న సొమ్ములను మీరు తిరిగి చెల్లించలేకపోతే సదరు బ్యాంకులు హామీ పడతాయి. దానివల్ల విదేశీ బ్యాంకులకు గ్యారెంటీ లాంటిది దొరుకుతుంది. ఒకవేళ రుణగ్రహీత అనుకున్న సమయానికి చెల్లించకపోతే ఈ భారతీయ బ్యాంకులు (ఎల్ఓయూ ఇచ్చినవి) ఆ సొమ్మును చెల్లించాలి. ఇలాంటి హామీ పత్రాలను నీరవ్ కంపెనీ 8 సార్లు పుట్టించి  మొత్తం 11 వేల కోట్లు రూపాయలు మొత్తాన్ని  2011 నుండి 2017 వరకు తీసుకుంది.ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ విదేశీ బ్యాoకులు నిజానికి విదేశాల్లో బ్రాంచిలు పెట్టుకున్న స్వదేశీ బ్యాంకులే. అలా కొంత కాలానికి తీసుకున్న సొమ్ము తిరిగి రాకపోయేసరికి ఇవి సదరు అసలు  స్వదేశీ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించాయి. హామీ పడిన మొత్తం మీరే కక్కాలి కదా అని దబాయించాయి. తెల్లబోయిన  స్వదేశీ బ్యాంకు వారు (పీఎన్‌బీ) అసలు మేం హామీ పత్రం ఇవ్వందే? అని విదేశీ బ్యాంకుతో అనడంతో వారూ తెల్లబోయారు. మోసం జరిగింది అని తెలిసిపోయింది.  అలా పీఎన్‌బీ.. సీబీఐకి రిపోర్ట్ చేయడంతో డొంక కదిలింది. అసలైన నకిలీ పత్రాలను పుట్టించడం అంటే అసలైన వారి హస్తం లేకుండా పోదు కదా. ఇందులో బ్యాంకు అధికారుల హస్తం ఉన్నదనీ, ఇద్దరి పేర్లను కంప్లైంట్‌లో పేర్కొన్నారు. వారిలో ఒకరు  గోకుల్ నాథ్ కాగా ఇంకొకరి పేరు మనోజ్. ఇంకా కంపెనీ  ప్రముఖులు  నీరవ్ మోడీ మామ మేహుల్ చోక్సీ..  నీరవ్ భార్య ఎమీ,  నీరవ్ తమ్ముడు నిషాల్‌ల పేర్లను  కూడా కంప్లైంట్‌లో పేర్కొన్నారు.  ఇందులో గమనిచాల్సిన విషయం.. ఈ స్కాం జరిగిన కాలం అంటే నకిలీ హామీ పత్రాలతో లోన్ పొందిన కాలం యూపీఏ హయంలో మొదలై బీజేపీ పాలనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. మరి ఇప్పుడైనా ఎలా బయటకు వచ్చింది అంటే దొంగలు నిశ్చిoతగా విదేశాల్లో దాక్కున్నారు కనుక, సొమ్ములు సర్దుబాటు కావలి కనుక ఎదో లెక్కలు రాసుకోవాలి కాబట్టి.   కాంగ్రెస్ కాలంలో స్కాంలు పెద్ద విషయమేం కాదు. అది అరిగి పోయిన రికార్డే.

బీజేపీ విషయానికి వస్తే స్కాం వెనుక చీకటి లావాదేవీల పరంపర జరుగుతున్నా అసలేం పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.  ప్రజా వేగు(విజిల్ బ్లోయర్) అయిన మరో వజ్రాల వ్యాపారి అయిన హరి ప్రసాద్ జూలై 2016లోనే ప్రధానమంత్రి ఆఫీసుకు అన్ని వివరాలతో కూడిన లేఖ రాశాడు. పీఎన్‌బీలో విజయ్ మాల్యా తరహా స్కాం జరుగుతున్నదనీ, రుణాలు తీసుకున్నవారు వాటిని తిరిగి చెల్లించే అవకాశాలు లేవని, అవి నాన్ పేయబుల్  అసెట్స్ (ఎన్పీఏ), వ్యర్థ రుణాలుగా మారే ప్రమాదం ఉన్నదని,  వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందనీ సవివరంగా రాశాడు.  

ఈ లెటర్ పంపించిన తర్వాత పీఎంఓ ఎటువంటి చర్యా తీసుకోలేదు. అయితే ఈమేరకు కంపైంట్ అందినట్టు  రిజిస్త్రార్ అఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి తెలిపింది. తర్వాత ఆర్ఓసీ నుంచి హరిప్రసాద్‌కు సమాధానం వచ్చింది. ఈ కేసు క్లోజ్ అయిందని ఇందులో ఈ స్కాం లేనేలేదని అందులో తేల్చేసింది. ఆ తర్వాత కూడా రుణాల పందేరం కొనసాగింది. స్కాం జరుగుతున్న కాలంలోనే ప్రభుత్వం, దానితోపాటు ప్రధాని మోదీ కూడా.. స్కాం సూత్రధారి నీరవ్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇందుకు ప్రధానంగా రెండు మూడు సంఘటనలు బలాన్ని చేకురుస్తున్నాయి. మొదటిది నరేంద్ర మోడీ వ్యాపారుల సమావేశంలో తన ఉపన్యాసంలో నీరవ్ మామ మేహుల్ చొక్సీ పేరుని స్వయంగా ప్రస్తావించడం. ‘బ్రాండెడ్ షో రూమ్‌లో బంగారం కొన్న తరువాత కచ్చితంగా నేను స్థానిక  వ్యాపారిని సంప్రదిస్తాను. ఇక్కడ నీషాల్ భాయి ఆసీనులై ఉన్నారు ఏమంటావు  భాయి!’ అని చనువుగా మాట్లాడడం ఈ అనుమానాలకు తావిస్తోంది. రెండోది..  స్విట్జర్లాండ్ దావోస్ జరిగిన సదస్సులో ప్రముఖులతో ప్రధాని మోడీ దిగిన ఫోటో.  ఆ గ్రూప్ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు  నీరవ్ మోడీ కూడా ఉన్నాడు.అంతకు ముందే జనవరి 2016లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 100 మంది డెలిగెట్లతో జరిపిన సమావేశంలో ముకేష్, అనిల్ అంబానీ, మిట్టల్, మిస్త్రీ బజాజ్‌‌లతో పాటు నీరవ్ కూడా  పాల్గొన్నాడు.    

మూడవది..  ముకేష్ అంబానీకి నీరవ్‌కు ఉన్న చుట్టరికం. ముఖేశ్ అంబానీ మేనకోడలు.. నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీకి భార్య. ప్రస్తుతం ప్రధాని మోడీకి అత్యంత ముఖ్యుల జాబితాలో అంబానీ మొదటి వాడు. ఒక కాంగ్రెస్ ప్రముఖుడు బీజేపీకి నీరవ్ భూరి విరాళాలు ఇచ్చాడని ఆరోపించాడు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద   ఈ స్కాం కి సంబంధించిన  సమాచారం ఉన్నా నీరవ్ కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వడం కచ్చితంగా అనుమానాస్పదమే.  ఈ ఫొటోలను అనుబంధాలను చూసే..   ప్రధానితో ఫోటో దిగి నిశ్చిoతగా స్కాం చేసుకోవచ్చు, తర్వాత దేశo  విడిచి దర్జాగా పారిపోవచ్చు అని కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ  ట్వీట్ చేశాడు.

కొంతమంది విదేశాలకు పారిపోయే వాళ్ళను ప్రభుత్వం ఎలా ఆపగలదు అని అడుగుతారు. ప్రభుత్వం అనుకుంటే కచ్చితంగా ఆపగలదని 2016లో ఒక సామాన్య ఎన్జీవో గ్రీన్ పీస్ కార్యకర్తని దేశం విడిచిపోకుండా అడ్డుకున్నప్పుడు అర్థం అవుతుంది. ఒక ఎన్జీవోనో లేక గ్రీన్ పీస్ కార్యకర్తనో అడ్డుకోగా లేంది లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను ఎందుకు అడ్డుకోలేరనే  ప్రశ్న రావడం సహజం.

ఈ స్కాం జరిగినట్టు జనాలకు తెలిసిన  రోజునే ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీరవ్ మోడీ ఆస్తులమీద దాడి చేసి 5100 కోట్ల విలువైన నికర ఆస్తులను, వజ్రాలను జప్తు చేసినట్టు వార్త ప్రముఖంగా వచ్చింది. ఇది నిజంగా జరిగి ఉంటే సంతోషమే.  కానీ ఇక్కడో చిన్న అనుమానం.. రిజర్వు బ్యాంకు వారు నోట్ల రద్దు జరిగిన తర్వాత ఒట్టి ఇదొందల, వెయ్యి నోట్లను 15 నెలలుగా లెక్కలు కట్టి కట్టి ఇంకా కడుతూనే ఉంటే ఒక్క రోజులోనే వేర్వేరు  రూపాల్లో ఉన్న అంత మొత్తాన్ని ఈడీ సిబ్బంది ఎలా లెక్కపెట్టగలిగారబ్బా అని.  ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా? లేక జనాలని బురిడీ కొట్టించేందుకు ఆడించిన ఆటా ? అనే వాళ్ళూ లేకపోలేదు. ఇది ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంకో లేక ఇంకో బ్యాంకు సమస్య కాదు. తాజాగా రోటోమాక్ పెన్నుల కంపెనీ అధినేత దాదాపు 3వేల కోట్ల రూపాయలకు బ్యాంకులకు కుచ్చు టోపీ వేశాడని సమాచారం.  గత మూడేళ్ల కాలంలో  బ్యాంకులలో జరిగిన కుంభకోణాల సంఖ్య దాదాపు 12000.  ఈ సొమ్ము ఎక్కడి నుoచి సేకరిస్తారు? బెయిల్ అవుట్ ప్యాకేజీ కింద కొట్టేస్తారో లేక జనం దాచుకున్న సొమ్ముకు ఎసరు పెడతారో ఎం పాడో చూడాలి?