నిర్భయ కేసు ‘మైనర్’కు సుప్రీంలో చుక్కెదురు.. అతనికి 19 ఏళ్లే - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ కేసు ‘మైనర్’కు సుప్రీంలో చుక్కెదురు.. అతనికి 19 ఏళ్లే

January 20, 2020

V BNB

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఆ దారుణానికి పాల్పడే నాటికి తాను మైనర్‌ను అంటున్న దోషి పవన్ గుప్తాకు సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. అతడు ఆనాటికి మేజరేనన్న పోలీసులు వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో పవన్‌తోపాటు మరో ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేయడానికి అడ్డంకి తొలిగిపోయింది. 

2012 డిసెంబర్ లోని నిర్భయపై ఆరుగురు యువకులు దారుణానికి తెగబడ్డం, వారికి కోర్టు మరణశిక్ష వేయడం తెలిసిందే. ఆ నాటికి తనకు 17 సంవత్సరాల నెల రోజులు మాత్రమే కనుక తనకు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని పవన్ కోరాడు. తన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సరిగ్గా విచారించలేదని ఆరోపించాడు. అయితే అతనికి అప్పటికి 19 ఏళ్లని పోలీసులు సాక్ష్యాలు చూపించారు. దీంతో సుప్రీం కోర్టు అతని వాదనను తోసిపుచ్చింది. ‘మీ వాదన నిజమని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవు.  ఈ పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసినా మళ్లీ ఇక్కడికొచ్చారు. ఒకే అంశంపై ఎన్నిసార్లు వాదిస్తారు.. ’ అని మందలించింది. నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1 తిహార్ జైల్లో శిక్ష అమలు చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అయితే వీరిలో ముగ్గురికి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశముండండంతో శిక్ష అమలుపై సందేహాలు నెలకొన్నాయి.