కలియుగంలో మరణశిక్షలేంటి?.. సుప్రీంలో నిర్భయ దోషి వాదన  - MicTv.in - Telugu News
mictv telugu

కలియుగంలో మరణశిక్షలేంటి?.. సుప్రీంలో నిర్భయ దోషి వాదన 

December 10, 2019

Nirbhaya case convict wants death sentence commuted, says already dying due to Delhi pollution

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు రేపేమాపో ఉరిశిక్ష పడుతుందని వార్తలు వస్తున్నాయి. తిహార్ జైలు నుంచి తమకు ఉరితాళ్ల ఆర్డర్లు వచ్చాయని బక్సర్ జైలు అధికారులు చెప్పారు. మరోపక్క.. దోషులకు మరణశిక్ష నుంచి తప్పించుకోడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నట్లు వార్తలు రావడం, దానిపై ఉన్న సంతకం తనది కాదని అతడు చెప్పడం తెలిసిందే. తాజాగా మరో దోషి అక్షయ్ కుమార్ సుప్రీం కోర్టు తలుపు తట్టాడు. 

మరణశిక్ష తీర్పును పునస్సమీక్షించి, రద్దు చేయాలని అతడు ఈ రోజు సుప్రీంలో పిటిషన్ వేశాడు. అందులో దిమ్మతిరిగే వాదనలు వినిపించాడు. ‘ఢిల్లీలో ఇప్పటికే వాయు కాలుష్యం, విషపూరిత వాతావరణం వల్ల ఇప్పటికే మాకు ఆయుర్దాయం తగ్గిపోతోంది. మళ్లీ మాకు మరణ శిక్ష విధించడం ఎంతవరకు సబబు?’ అని అతడు ప్రశ్నించాడు. అంతటితో ఊరుకోకుండా వేదాలు, ఉపనిషత్తులను కూడా తీసుకొచ్చాడు. ‘కలియుగంలో మనిషి గరిష్టంగా 50 నుంచి 60 ఏళ్లకు మించి బతకడు. మరి అలాంటప్పుడు మరణశిక్షలెందుకు? అని అతితెలివి ప్రదర్శించాడు. అతని పిటిషన్‌ను సుప్రీం కోర్టు రిజిస్ట్రీ స్వీకరించింది. మరోపక్క.. దోషుల ఉరికి సన్నాహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరో దోషి పవన్ గుప్తాను మండోలీ జైల్ నుంచి తీహార్ జైలుకు తరలించారు. అక్షయ్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ ఇప్పటికే తిహీర్ జైల్లో ఉన్నారు.