నిర్భయ దోషుల ముందు మృత్యువు.. పిటిషన్ల కొట్టివేత.. అయినా ఆఖరి చాన్స్ ఉంది - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషుల ముందు మృత్యువు.. పిటిషన్ల కొట్టివేత.. అయినా ఆఖరి చాన్స్ ఉంది

January 14, 2020

Nirbhaya case.

తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని నిర్భయ హత్యాచార కేసులో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వారి శిక్షను రద్దు చేయడానికి కారణాలేవీ కనిపించడం లేదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం వారిని ఈ నెల 22న తిహార్ జైల్లో ఉరి తీయాలని ఆదేశించింది. దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించి తీర్పునిచ్చింది. అయితే వీరిద్దరికి చిట్టచివరి అవకాశం మరొకటుంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవచ్చు. నలుగురు దోషులను ఈ నెల 22న ఉరి తీయాలని ఢిల్లీ పటియాలా కోర్టు ఈ నెల 7న ఆదేశించడం తెలిసిందే. 

కాగా, మరో  ఇద్దరు దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా ఇంకా సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్లు వేయలేదు. 22వరకు వారికి సమయం ఉంది. వీరితోపాటు వినయ్, ముఖేశ్ కూడా చిట్టచివరి అవకాశంగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరొచ్చు. తనకు క్షమాభిక్ష పెట్టాలని వినయ్ వర్మ ఇప్పటికే రాష్ట్రపతిని కోరారు. అయితే ఈ కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టొద్దని కేంద్రం ఆయనకు సిఫార్సు చేసింది.  అత్యాచార కేసు దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రపత రాంనాథ్ కోవింద్ ఇటీవల చెప్పారు. దీంతో ఈ కేసులోనూ ఆయన క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 2012 డిసెంబర్ నెలలో ఢిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు నిర్భయపై దారుణానికి ఒడిగట్టారు. రాంసింగ్ అనే దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఒకడు మైనర్ కావడంతో శిక్ష తప్పించుకున్నాడు.