ఆఖరి పోరాటం.. కోర్టుకెక్కిన నిర్భయ దోషి  - MicTv.in - Telugu News
mictv telugu

ఆఖరి పోరాటం.. కోర్టుకెక్కిన నిర్భయ దోషి 

February 28, 2020

Nirbhaya

నిర్భయ దోషులకు మరణశిక్ష వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. చట్టబద్ధంగా తమకున్న అన్ని అవకాశాలనూ దోషులు వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయ అవకాశాన్నీ వాడుకోని పవన్ గుప్తా(25) సుప్రీం గడప తొక్కాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. నలుగురు దోషులను వచ్చే నెల 3న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంతో వినయ్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తమకు జారీ చేసిన డెత్ వారెంట్‌ను కూడా నిలిపేయాలని కోరాడు. 

2012 డిసెంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలో మెడికల్ విద్యార్థిని నిర్భయపై వినయ్ శర్మ, ముఖేశ్ కుమార్, అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, రాం సింగ్, ఒక మైనర్ ఘోరానికి తెగబడ్డారు. రాం సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మైనర్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురిని వెంటనే ఉరి తీయాలని నిర్భయ తల్లి కోరుతోంది. వినయ్, ముఖేశ్, అక్షయ్ ఇప్పటికే సుప్రీం కోర్టుకు పెట్టుకున్న పిటిషన్లు, రాష్టపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఉరి ఘడియలు దగ్గర పడ్డంతో పవన్ కూడా కోర్టు గడప తొక్కాడు.