నిర్భయ కేసులో కేంద్రానికి షాక్.. దోషులకు మరో వారం - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ కేసులో కేంద్రానికి షాక్.. దోషులకు మరో వారం

February 5, 2020

gbhnm

నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టు విధించిన స్టే‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దోషులకు వేర్వేరుగా శిక్ష విధించేందుకు స్టే‌ను ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును మార్చేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా  ఉరి తీయడానికి వీలులేదని పేర్కొంది. అందరికి ఓకేసారి శిక్ష విధించాలని స్పష్టం చేసింది. 

నలుగురు దోషులు తమకు అవకాశం ఉన్నంత మేర పిటిషన్ దాఖలు చేసుకోవడానికి మరో వారం రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాతనే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం రోజుల తర్వాతనే దోషులకు డెత్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.నిర్భయ కేసులో అధికారుల అలసత్వంతోనే రివ్యూ పిటిషన్లపై ఆలస్యం అవుతోందని అభిప్రాయపడింది. నలుగురు దోషులూ.. క్రూరమైన నేరానికి పాల్పడ్డారని న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. దోషులు చట్టాలను ఉపయోగించుకొని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్టు కేంద్రం తరుపు న్యాయవాది ఆరోపించారు.