సొమ్మసిల్లి పడిపోయిన ‘నిర్భయ’ జడ్జి..వినయ్ పిటిషన్ కొట్టివేత - MicTv.in - Telugu News
mictv telugu

సొమ్మసిల్లి పడిపోయిన ‘నిర్భయ’ జడ్జి..వినయ్ పిటిషన్ కొట్టివేత

February 14, 2020

Nirbhaya

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఈనెల 1నే నిర్భయ హత్యాచార దోషులను ఉరి తీయాల్సిఉంది. కానీ, వాళ్ళు ఉరి శిక్ష అమలును జాప్యం చేయడానికి వరుస పిటిషన్‌లతో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు. నిర్భయ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ ఆర్‌ భానుమతి శుక్రవారం అనారోగ్యానికి గుయారయ్యారు. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తూ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కోర్టు సిబ్బంది ఆమెను ఛాంబర్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. కొద్ది క్షణాల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. జస్టిస్‌ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దోషుల కొత్త డెత్‌ వారెంట్లపై ట్రయల్‌ కోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున తాము వేచి చూస్తామని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. డెత్ వారెంట్లపై ఢిల్లీ ట్రయల్‌ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. అంతకు కొద్ది సమయం క్రితం నిర్భయ దోషి వినయ్‌ శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ భానుమతి ధర్మాసం తీర్పు వెల్లడించారు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ వినయ్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదంటూ కొట్టిపారేసింది. నిర్భయ కేసులో దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ తన మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంటూ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో వినయ్‌శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వినయ్‌ శర్మ మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడన్న వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆయన మెడికల్‌ రిపోర్టులను బట్టి అతడు ఆరోగ్యంగాననే ఉన్నాడని ధర్మాసనం పేర్కొంది.