నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం.! - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం.!

February 20, 2020

dcbb

నిర్భయ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తీహార్ జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న అతడు విచిత్రంగా ప్రవర్తిస్తూ తలను గోడకు బాదుకున్నాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలు అయినట్టుగా జైలు సిబ్బంది వెల్లడించారు. అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. డెత్ వారెంట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడంతో ఉరి శిక్షను అడ్డుకునే ప్రయత్నంలో భాగమేనని అంటున్నారు. 

వినయ్‌తో పాటు మిగిలిన దోషులు కూడా తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వేర్వేరు బ్యారకుల్లో ఉన్నారు. వీరందరిని  మార్చి 3న ఉరి తీయాలని పాటియాలా హైకోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో అతడు ఇలా విచిత్రంగా ప్రవర్తించాడు. కాగా ఇప్పటికే అనేక సార్లు ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు రకరకాల పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించినా దీనిపై కూడా కోర్టుకెక్కాడు. అతనికి ఉన్న అవకాశాలన్ని ముగియడంతో మార్చి 3న ఉరికి ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. 

వినయ్ శర్మ తలను గోడకు బాదుకోవడంతో ఈ చర్య కారణంగా ఉరి మరోసారి వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇప్పటికే పవన్ గుప్త రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.