‘నిర్భయ’ స్నేహితుడికి డబ్బు యావ! జర్నలిస్ట్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘నిర్భయ’ స్నేహితుడికి డబ్బు యావ! జర్నలిస్ట్ ట్వీట్

October 12, 2019

Nirbhaya friend avanindra pandey tv channel interviews 

దేశంలో ఆడపిల్ల భద్రతను ప్రశ్నార్థం చేసిన ‘నిర్భయ’ సామూహిక హత్యాచారం ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ రాజధాని నడిబొడ్డున కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్థినిపై జరిగిన పాశవిక హింసకు దేశం కన్నీళ్లు పెట్టింది. కామాంధులను శిక్షించడానికి ఆమె పేరుతో చట్టం కూడా తీసుకొచ్చింది. దుండగుల దాడిలో నిర్భయతోపాటు గాయపడిన ఆమె స్నేహితుడు అవనీంద్ర పాండే ఈ కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షిగా కీలక పాత్ర కూడా పోషించాడు. అయితే అతని గురించి కొత్త విషయం ఒకటి బయటపడింది. 

2012 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘోరం గురించి వివరించడానికి అతడు టీవీ చానళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు అజిత్ అంజుమ్ అనే టీవీ జర్నలిస్టు చెప్పాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. 2013 సెప్టెంబరులో నిర్భయ ఘటనపై మాట్లాడడానికి తమ స్టూడియోకు రావాలని ఒక టీవీ చానల్ సిబ్బంది అతణ్ని కోరారు. తనకు డబ్బులిస్తేనే వస్తానని అవనీంద్ర చెప్పాడు. అజిత్ తొలుత నమ్మేలేదు. తర్వాత తానే నిర్ధారించుకోడానికి అవనీంద్రపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. ‘అతనికి రూ. లక్ష ఇచ్చి స్టూడియోకు పిలిపించాం. డబ్బులు ఇస్తున్నప్పుడు వీడియో తీశాం. నిర్భయపై జరిగిన దారుణంపై అతనికి బాధ లేనట్లు కనిపించింది.. అతణ్ని ఇంటర్వ్యూ చేస్తూ.. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాను. తీసుకోలేదని అతడు బొంకాడు. వీడియో చూపించేసరికి, ఇంకెప్పుడూ అలా చేయనని అన్నాడు…’ అని తెలిపారు. దీనిపై అప్పట్లోనే బయటికి చెబితే కేసు నీరుగారుతుందని బహిర్గతం చేయలేదన్నారు.