నిర్మల్ జిల్లా వెంగ్వాపేట్ గ్రామంలో దున్నపోతు మేడపైకి ఎక్కింది. ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆకలేసిన దున్నపోతుకు సమీపంలోని ఇంటి మెట్లపై పశుగ్రాసం కనిపించింది. అక్కడికి వెళ్లి గడ్డి తిన్న తర్వాత.. పైకెళ్తే మరింత దాణా దొరుకుతుందేమోనని భావించి డాబాపైకి ఎక్కింది. అది ఆశించినట్లుగా అక్కడేమీ లేకపోవడంతో దిక్కులు చూసింది. డాబా ఎక్కనైతే ఎక్కేసింది కానీ.. దిగడం మాత్రం తెలియలేదు.
ఇది గమనించిన గ్రామస్థులు.. దున్న కిందకు తీసుకొచ్చేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. ఈ హడావిడిలో అది పిట్టగోడపై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఈలోపు సర్పంచి గంగయ్య పశు వైద్యులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్నారు. మత్తుమందు ఇచ్చినా దాన్ని దింపడం కష్టమని భావించి.. భారీ క్రేన్‌ను తెప్పించారు. క్రేన్ సాయంతో ఇంటి పైనుంచి దున్నను కిందకు దించారు.