మొండి బకాయిలపై కేంద్రం నజర్.. త్వరలోనే కీలక బ్యాంకుల విలీనం
ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థలతో పాటు పలు ఆర్థిక సంస్థలల్లో మార్పులు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్నట్టు తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకులను ఒకే బ్యాంకు కిందకు చేర్చనున్నారు. తాజా నిర్ణయంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా అవతరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు
దీంతోపాటు మొండి బకాయిలపై కూడా కొరడా ఝులిపింస్తామన్నారు నిర్మలా సీతారామన్. బకాయిలను రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో రుణాలపై కూడా నిఘా పెట్టనున్నట్టు వెల్లడించారు. రూ. 250 కోట్లు దాటితే నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నీరవ్ మోదీ లాంటి ఘటనలు మరోసారి దేశంలో జరగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. వీటితో పాటు ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలను సర్‌చార్జీ నుంచి మినహాయింపు ఇస్తామని ప్రకటించారు.