మునుపటిలా పాన్ నంబర్ కోసం కాలయాపన చెయ్యాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు అని మీసేవా కేంద్రాల వెంట తిరగాల్సిన పనిలేదు. ఒక్క ఆధార్ కార్డుతో పాన్ నంబర్ పనులు సులువుగా అయిపోయేలా కేంద్రం మార్గదర్శకాలను తయారుచేసింది. దీంతో ఇకపై పాన్ నంబర్ క్షణాల్లోనే అందనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఈ-పాన్’ సౌకర్యాన్ని ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఆధార్ కార్డు నెంబరుతో పాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేని ఈ ఎలక్ట్రానిక్ పాన్ కార్డుకు ఎలాంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు.
డిజిటల్ ఇండియాలో భాగంగా ఆదాయపు పన్నుశాఖ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అయితే ఈ సదుపాయం బీటా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ప్రస్తుతం అధికారికంగా ప్రారంభించినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది.