‘ఇండియా-పాక్ మ్యాచ్‌ గ్రూపులుగా చూస్తే రూ. 5000 జరిమానా’ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇండియా-పాక్ మ్యాచ్‌ గ్రూపులుగా చూస్తే రూ. 5000 జరిమానా’

August 28, 2022

ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. మరికాసేపట్లో ఈ దాయాది దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే జమ్ము కశ్మీర్‌లో శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) సరికొత్త ఆదేశం జారీ చేసింది. ఆసియా కప్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ పై ఆంక్షలు విధించింది. విద్యార్థులు ఈ మ్యాచ్‌ను కలిసి గ్రూపుగా చూడొద్దని ఆదేశించింది. అలాగే, మ్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికల్లోనూ ఎలాంటి పోస్టులు చేయొద్దని పేర్కొంది.

ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఓ నోటీసు జారీ చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని ఆదేశించారు. ‘దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కొన్ని దేశాల క్రికెట్ జట్లు ఓ క్రికెట్ సిరీస్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్న విషయం విద్యార్థులు తెలిసిందే. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ను ఒక గేమ్‌లాగే తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. కాబట్టి, విద్యా సంస్థలో లేదా హాస్టల్‌లో ఎలాంటి ఇన్‌డిసిప్లైన్ వాతావరణం సృష్టించకుండా ఉండాలి’ అని నోటీసులో ఎన్ఐటీ యాజమాన్యం తెలిపింది.

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న ఈ ఆదివారం నాడు విద్యార్థులు వారి వారికి కేటాయించిన గదుల్లోనే ఉండాలని ఆదేశించింది. ఇతర విద్యార్థులను తమ రూమ్‌లలోకి రానివ్వొద్దని తెలిపింది. గ్రూపులుగా కలిసి ఈ మ్యాచ్‌ను చూడొద్దని ఆదేశించింది. ‘ఏదైనా గదిలో గ్రూపులుగా మ్యాచ్‌ చూస్తున్నట్లు తెలిస్తే.. ఆ గదిలో కనిపించిన వారిని ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిబార్‌ చేస్తాం. ఆ గదిలో గుర్తించిన విద్యార్థులందరికి రూ.5వేల వరకు జరిమానా విధిస్తాం’ అని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు హాస్టల్‌ గదుల నుంచి బయటకు రావద్దని వెల్లడించింది.