కరోనాలో కామెడీ.. భారతీయులపై నిత్యానంద నిషేధం.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాలో కామెడీ.. భారతీయులపై నిత్యానంద నిషేధం..

April 23, 2021

Nithyananda bans Indians from entering Kailasa

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సామెత గుర్తుకొస్తుంది కొందరి చేష్టలు చూస్తుంటే. అత్యాచారం, హత్యలు, హింస వంటి నానా ఘోరాల్లో నిందితుడైన నిత్యానందస్వామి కామెడీ కింగ్ గా మారిపోయి చాలా ఏళ్లే అయింది . ఆవులతో మాట్లాడిస్తాడని చెప్పిన ఆయన మాట నిలబట్టుకోకుండా దేశం నుంచే పారిపోయాడు. ఈక్వెడార్ దేశం పక్కన ఓ చిన్న దీవి కొనుక్కుని కైలాస ద్వీపం పేరుతో దుకాణం తెరిచిన సంగతి తెలిసే ఉంటుంది.

తనను జనం ఎక్కడ మరిచిపోతారోనని ఆయన మళ్లీ తెరపైకి వచ్చాడు. కైలాస ద్వీపానికి భారతీయులు రాకూడదని తేల్చి చెప్పాడు. ఈ మేరకు పలు దేశాల్లోని తమ ‘రాయబార కార్యాలయాలకు’ సర్క్యలర్లు కూడా పంపించాడు. పలు దేశాల్లో కరోనా పెచ్చరిల్లింది కనుక తన దేశ రక్షణ కోసం నిషేధం పెడుతున్నానని ప్రకటించాడు. భారత్‌, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియా దేశాల నుంచి ఎవరూ తన గడ్డకు రాకూడదని స్పష్టం చేశాడు. కాగా, అతన్ని పట్టుకోవడంలో భారత నిఘావర్గాలు దారుణంగా విఫలమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యానందకు కొంతమంది పలుకుబడి గల వ్యక్తుల రక్షణ ఉన్నట్లు వార్తలు ఇదివరకే వచ్చాయి. అతడు కొన్ని వందల కోట్లకు ద్వీపాన్ని కొన్నాడని సమాచారం. అయితే తమకు అతని గురించి ఎలాంటి సమాచారమూ లేదని ఈక్వెడార్ చెప్పుకొస్తోంది.