నిత్యానంద తీర్థయాత్రలో ఉన్నాడు.. అప్‌డేట్ కాని పోలీసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద తీర్థయాత్రలో ఉన్నాడు.. అప్‌డేట్ కాని పోలీసులు..

February 3, 2020

Nithyananda

ప్రజలతో సంబంధాలు నెరిపేవాళ్లు నిత్య అప్ డేట్స్ తెలుసుకుని ఉండాలి. కేసులు, కోర్టులు, జైళ్లు, ఇతర అధికారిక పనుల్లో బిజీగా ఉండే పోలీసులు మరింత అప్ టు డేట్‌గా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా చేశారో లేకపోతే, ఆ.. ఎవరుపట్టించుకుంటార్లే అనుకున్నారోగాని కర్ణాటక పోలీసులు కోర్టులో నవ్వుల పాలయ్యారు. 

భక్తులపై అత్యాచారాలకు తెగబడి దేశం నుంచి పారిపోయిన నిత్యానంద స్వామి ప్రస్తుతం కరీబియన్ దేశమైన బెలిజ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతడు ఈక్వెడార్ సరిహద్దులో కైలాసం పేరుతో ఏకంగా ఒక హిందూ దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తను సాక్షాత్తూ పరమశివుడి అవతారమని, తనను వేధిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. అతన్ని పట్టుకోడానికి ఇంటర్ పోల్ సంస్థ నోటీసు కూడా జారీచేసింది. 

అయితే స్వాములవారు ప్రస్తుతం తీర్థయాత్రలో ఉన్నారని, అందువల్ల అత్యాచార కేసులో ఆయనగారికి తాము నోటీసులు అందించలేకపోతున్నామని కర్ణాటక పోలీసులు అక్కడి హైకోర్టుకు విన్నవించుకున్నారు. రేప్ కేసులో 2010లో స్వామికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌కు వారు సమాధానమిచ్చారు. బిడది ఆశ్రమంలో నిత్యానంద లేదరని, ఆయన ప్రస్తుతం ఆధ్యాత్మిక సంచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందువల్ల ఆయనకు బదులు ఆయన సహాయకురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామన్నారు. అయితే తాను వాటిని తీసుకోలేదని, పోలీసులే బలవంతంగా అంటగట్టారని అర్చానంద మండిపడ్డారు.  కేసుపై పోలీసులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.