టెస్లా కార్ల అధినేత ఎలన్ మస్క్ అంటే తెలియని వ్యాపార వేత్తలు ఉండరు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన.. 1995లో ‘జిప్2’అనే వ్యాపారంతో మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ, తమ వ్యాపార సంస్థలను దేశ, విదేశాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే రూ. 44 బిలియన్లతో ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎలన్ మస్క్‌కు ఓ బంపరాఫర్ ఇచ్చారు.
ఇటీవలే నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..” దేశీయంగా పెట్రోల్ వాహనాల కన్నా, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తక్కువ ధరలో లభించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎలన్ మస్క్ సీఈఓగా ఉన్న టెస్లా ఈవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, చైనాలో తయారు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతామంటేనే సమస్య. భారత్‌లోనే వాహనాలను ఉత్పత్తి చేస్తే, ఆ సంస్థకూ ప్రయోజనకరం” అని ఆయన పరోక్షంగా ఎలన్ మస్క్‌కు ఆఫర్ ఇచ్చారు.
మరోపక్క మార్కెట్లో కార్ల ధరలపై 60–100% సుంకాలు ఉంటున్నాయి. అంతిమంగా కారు ఖరీదులో 110% వరకూ దిగుమతి సుంకాల భారం ఉంటోంది. దీన్ని తగ్గించి భారత్‌లో విక్రయించుకునేందుకు అనుమతిస్తే.. ఆ నిధులను దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇన్వెస్ట్ చేస్తామని టెస్లా సంస్థ తెలిపింది. దాంతో టెస్లా కోసం ప్రభుత్వ నిబంధనలను మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. మరోసారి ఎలన్ మస్క్ ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేస్తే, బాగుంటుందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యలతో ప్రాముఖ్యత సంతరించుకుంది.