Nitish Kumar's "Not A Claimant, Nor Desire" Reply To PM Question
mictv telugu

పీఎం ప‌ద‌విపై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్

September 6, 2022

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర కూటమికి సంబంధించిన పార్టీ నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు నితీష్ కుమార్. ఆయ‌న ఇవాళ సీపీఎం నేత సీతారాం ఏచూరిని క‌లిశారు.

ఏచూరితో సమావేశం అనంతరం మీడియాతో రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీ చేస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఆ పోస్టును తాను కోరుకోవ‌డం లేద‌ని, ప్ర‌ధాని కావాల‌న్న ఆశ లేద‌ని అన్నారు నితీశ్. సీపీఎం తాము క‌లిసే ఉన్నామ‌ని, అందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. విభిన్న పార్టీలు ఒకే ద‌గ్గ‌ర‌కు వ‌స్తే అది పెద్ద విష‌యం అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఒక ద‌గ్గ‌ర‌కు వ‌స్తే అది భారీ విష‌యం అవుతుంద‌ని నితీశ్ అన్నారు.

మంగళవారం సాయంత్రం సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజాతో సీఎం నితీష్ కుమార్ భేటీ కానున్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జనతాదళ్-సెక్యులర్(జేడీఎస్) అధినేత, కుమారస్వామిని కలిశారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఈ రోజు భేటీ అయ్యారు. దీంతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఐఎన్డీడీకి చెందిన ఓం ప్రకాశ్ చౌతాలా వంటి ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉంది.