కేకేఆర్ కెప్టెన్సీపై ఉత్కంఠకు తెరపడింది. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కొత్త కెప్టెన్ వచ్చేశాడు. కేకేఆర్ అఫీసియల్‌గా తమ నూతన సారథి ప్రకటించింది. జట్టును నడిపించే బాధ్యతలను నితీశ్ రాణాకు కట్టబెట్టింది.
గత కొంతకాలంగా కేకేఆర్ కెప్టెన్‌పై చర్చ సాగింది. షకీబుల్ హసన్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, నితీశ్ రాణాల్లో ఒకరిని కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. చివరికి ఇండియాకు చెందిన నితీశ్ రాణాపైనే కేకేఆర్ యాజమాన్యం నమ్మకముంచింది.
కొత్తగా కెప్టెన్ గా ఎంపికైన నితీశ్ రాణాకు కేకేఆర్ యాజమాన్యం అభినందనలు తెలిపింది. జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాడని బావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. వైట్ బాల్ క్రికెట్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ వ్యవహరించడం, 2018 నుంచి కేకేఆర్ జట్టుతో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా ఎంపిక చేశారు.
కేకేఆర్ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన రాణా.. 1744 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. పాయింట్స్ టేబుల్లో 7 వస్థానంలో నిలిచింది. మొత్తం టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కి వెళ్లకుండానే ముందే నిష్క్రమించింది.
ఆసీస్‌తో ఇటీవల జరిగిన నాలుగో టెస్ట్‌లో అయ్యర్ వెన్నుగాయంతో ఆటకు దూరమయ్యాడు. గాయం తీవ్రమైనది కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సర్జరీ కూడా అవసరమని నిర్ధారించారు. దీంతో ఆసీస్ వన్డే సిరీస్‌తో ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
మొదట ఐపీఎల్ మొదటి భాగానికి మాత్రమే దూరమవుతాడనే వార్తలొచ్చిన సర్జరీ నేపథ్యంలో పూర్తిగా టోర్నికే దూరమవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌కు కూడా అనుమానమే. ప్రస్తుతం అయ్యర్ సర్జరీ కోసం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.