Nitish who took oath as Chief Minister.. as Deputy Chief Minister
mictv telugu

8వ సారి సీఎంగా నితీశ్ ప్రమాణం..ఉపముఖ్యమంత్రిగా

August 10, 2022

బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయు నేత నితీశ్ కుమార్ కాసేపటిక్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. గత మూడు సంవత్సరాల క్రితం బీజేపీ, జేడీయూ ఆధ్వర్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వాన్ని నడిపించిన నితీశ్ కుమార్.. తాజాగా బీజేపీతో బంధం తెంచుకొని, ఆర్డేడీ, కాంగ్రెస్‌తో జతకట్టారు. ఈ క్రమంలో ఆ కూటమి సారథిగా బీహార్ రాష్ట్రానికి 8వసారి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ముందుగా రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్.. నీతీశ్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆర్డేడీ నేత తేజస్వీ యాదవ్‌ని ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి, తల్లి రబ్రీదేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆర్డేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో నితీశ్ ఫోన్ చేసి, రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులను వివరించారు. నీతీశ్ నిర్ణయాన్ని లాలూ సమర్ధించి, ఆయనను అభినందించినట్లు ఆర్డేడీ వర్గాలు వెల్లడించాయి.

నితీశ్ కుమార్..బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకున్నారు? అనే విషయానికొస్తే..కొన్నాళ్లుగా బీజేపీ అధిష్టానంపై నీతిశ్ కూమార్ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, త్వరలోనే బీజేపీతో బంధం తెంచుకోవడానికి సిద్దమైయ్యారని గతకొన్ని నెలలుగా బీహార్‌లోని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఆ కథనాలను నిజం చేస్తూ, తాజాగా ఆయన ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్నారు. ఆ కూటమి నుంచి బయటకొచ్చి సీఎం పదవికి రాజీనామా చేశారు. వెంటనే మహాకూటమితో పూర్వ సంబంధాలను కలుపుకొని, ప్రత్యర్ధి ఆర్డేడీ పార్టీతో మళ్లీ చేతులు కలిపారు. ఆయా పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్‌ను కోరారు. అందుకు ఆయన ఆమోదించడంతో నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.