Nitish will join BJP again: Prashant Kishore
mictv telugu

ఆయన ఇంకా బీజేపీతో టచ్‌లోనే ఉన్నారు.. పీకే సంచలన ఆరోపణ

October 20, 2022

రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీయూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చినా నితీష్ ఇంకా బీజేపీతో టచ్‌లోనే ఉన్నారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యం కూడా చూపించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్, జేడీయూ ఎంపీ హరివంశ్ ఇంకా ఆ పదవిలో కొనసాగడమే దీనికి నిదర్శనమన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ జాతీయ కూటమి కడతారన్న అంచనాల నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాక, అవసరమైతే నితీష్ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. దీనిపై హరివంశ్ వివరణ కోరగా, ఆయన స్పందించడానికి నిరాకరించారు. జేడీయూ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. నితీష్ 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, పీకే రాజకీయాల్లో వచ్చి ఆరు నెలలే అవుతుందని వివరించారు. పీకే వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వెల్లడించారు.