పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా..

September 6, 2017

రాసలీలల స్వామి నిత్యానంద, ఆయన ప్రియ భక్తురాలు, సినీనటి రంజితల వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. తమ రాసలీలల కేసులో ఏడేళ్లుగా విచారణ జరుపుతున్న దర్యాపుత సంస్థలపై ఆమె కోర్టుకెక్కారు. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదారి పట్టిస్తున్నాయని, అసలు దర్యాప్తే పెద్ద బూటకమని చెన్నై కోర్టులో వేసిన పిటిషన్ లో తెలిపారు. విచారణ పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె అడ్డం తిరగడం గమనార్హం. పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. సీబీసీఐడీకి నోటీసులు జారీ చేసింది.

నిత్యానంద, రంజిత సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి రావడంతో దుమారం రేగడం తెలిసిందే. విచారణలో రంజిత చాలాసార్లు మాట మార్చారు. స్వామి తనను బెదిరించి అలా లొంగదీసుకున్నారని ఒకసారి చెప్పారు. తర్వాత అబ్బే అదేంలేదు, అసలు ఆ వీడియోనే నకిలీదని అని చెప్పారు. కొన్నాళ్లు స్వామికి దూరంగా ఉన్న రంజిత తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. నిత్యానందతో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనతో మళ్లీ ఆశ్రమంలో గడిపారు. ఇప్పుడేమో అసలు కేసే దండగమారి కేసు అంటున్నారు. అయితే ఆ వీడియో అసలైనదేని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

అసలు రంజిత, నిత్యానందల కేసుతో విలువైన కోర్టు సమయం వృథా అవుతోందని లాయర్లు అంటున్నారు. సన్నిహితులైన వారిద్దరూ పెళ్లి చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని మరికొందరు లాయర్లు ఉచిత సలహా ఇస్తున్నారు. వారు పెళ్లాడినా నిత్యానంద మళ్లీ కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆయనపై రాసలీలల కేసుతోపాటు ఆశ్రమంలో మరెన్నో అక్రమాలకు, అఘాయిత్యాలు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.