భక్తులతో రాసలీలు, అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటూ గుట్టుచప్పుడు కాకుండా దేశం నుంచి పారిపోయిన నిత్యానంద స్వామి ఏకంగా దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి కేటుగాళ్లు తప్పించుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రయాణాల కట్టడిని దారుణంగా కూలగొట్టి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పారిపోయాడు. అతడు ఈక్వెడార్ వద్ద ఏర్పాటు చేసుకున్న ‘కైలాస’ దేశం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్వామివారు తమకు తమకు కూడా అక్కడ పౌరసత్వం ఇవ్వాలని కొందరు అభాగ్యులు నిజాయతీగా కోరుతున్నారు. సొంత హిందూ దేశం, సొంత రాజ్యాంగం, సొంత జెండా అంటున్న నిత్యానందుడు ఒక దేశాన్ని ఏ భరోసాతో ఏర్పాటు చేశాడు? దాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్న ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. పాలస్తీనా, ఉత్తర సైప్రస్, తైవాన్ వంటి ప్రాంతాలకు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇప్పటివరకు ‘దేశ’ హోదా దక్కలేదు. మరి మనోడి ‘కైలాస’ దేశానికి గుర్తింపు దక్కుతుందా? అసలు ఒక దేశాన్ని ఏర్పాటు చేయడం సంతకం చేసినంత ఈజీనా?
అన్నీ ఉంటే సులభమే.. షరతులు ఇవీ..
చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో తిప్పలు పడతాం. అలాంటిది ఏకంగా దేశాన్ని నిర్మించాలంటే? కష్టమే! అయితే అన్నీ ఉంటే అత్యంత సులభం కూడా. ముఖ్యంగా బోల్డంత డబ్బులు ఉండాలి. దేశం అంటే కేవలం మన్నుమశానమే కాదు, మనుషులు ఉంటారు కాబట్టి శాశ్వత పౌరులు కూడా ఉండాలి. కొత్తగా ఉనికిలోకి వచ్చే దేశం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలి. అంటే మరో దేశంపై దాడి చేయడం, దాని అంతర్గత వ్యవహారాల్లో కాళ్లూ, వేళ్లూ పెట్టడం వంటి పనులు చేయకూడదు. ఆర్థిక స్వావలంబన కూడా ఉండాలి.
భూమి ఎక్కడ దొరుకుద్ది?
భూమిపై మనుషులు నివసించడానికి అనువైన ప్రాంతాలన్నీ ఇప్పటికే దేశాల్లో చేతుల్లో ఉన్నాయి. చివరికి మంచుఖండం అంటార్కిటికాలోనూ దేశాలు జెండాలు పాతేశాయి. అరబ్ దేశాల సరిహద్దుల్లో కొంత ఎడారి భూమి, మహాసముద్రాల్లో చిన్నపాటి దీవులు ఖాళీగా ఉన్నాయి. వాటి జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఎవరూ లేరుకదా అని మనం అక్కడ దేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం అంటే కుదర్దు. పక్క దేశాల అనుమతి పొందాలి. నిత్యానంద కూడా ఈక్వెడార్ నుంచి ద్వీపాన్ని కొన్నాడు.
మనుగడ ఎలా?
మనుషులు, చాలినంత డబ్బు ఉంటే మనుగడ సాధ్యమే. విదేశాలతో వ్యాపారాలు, సాంస్కృతిక సంబధాలు నెరవేర్చుకోవచ్చు. అయితే వీటివల్ల ఇతర దేశాలకు ఇబ్బంది తలెత్తిత్తే దుకాణాన్ని బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సామరస్యంగా మెలగుతూ తమ బతుకు తాము బతకాలన్నమాట. నిత్యానందగాని, మరొకరుగాని తమ పలుకుబడి, డబ్బుతో ఎన్ని దేశాలను ఏర్పాటు చేసుకున్నా అంతిమంగా అక్కడ మనుషులు స్వేచ్ఛగా జీవించే వాతావరణం, సదుపాయాలు ముఖ్యం! అలా కాకుండా కేవలం కొంతమంది భక్తులను, అనుచరులను ఓ ద్వీపంలో పెట్టి సాకి సంతరిస్తూ, ధనబలంతో ‘ఇష్టాదేశం’గా వారిపై పెత్తనం చేస్తూ అదే దేశమని అంటే సరిపోదు! దేశాలు ఊరుకున్నా ఆమ్నెస్టీ ఊరుకోదు. ఆపైన ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక బలగాలూ ఉంటాయి !!!