నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా

July 13, 2020

Nizamabad

రెండు రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందకపోవడంతో నలుగురు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఇది ముమ్మాటికి వైద్యసేవల నిర్లక్ష్యమే అనే  విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో  ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన డీఎంఈకి సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా ఆసుపత్రి వైద్యుల వాట్సాప్‌ గ్రూప్‌లోనూ రాజీనామా చేస్తున్నట్లు వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. మృతుల విషయంలో తలెత్తిన విమర్శల వల్లే తాను మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 

చనిపోయిన వారిలో ముగ్గురు కరోనా బాధితులు ఉండగా.. వైద్య సేవల నిర్లక్ష్యంపై ఆరోగ్యశాఖ అధికారులు ఆయనపై సీరియస్‌ అయినట్లు సమాచారం. ఇదిలావుండగా మరుసటి రోజే ఆటోలో శవాన్ని తరలించే విషయంలో కూడా వివాదం చెలరేగింది. ఇది కూడా సూపరింటెండెంట్ వైఫల్యమే అనే విమర్శలు వచ్చాయి. దీనిపైన జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు రాజీనామా చేసినట్లు  తెలుస్తోంది.  కాగా, ఆయన రాజీనామాను డీఎంఈ ఆమోదిస్తారా?లేదా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.