దిశపై అసభ్య వ్యాఖ్యలు.. నిజామాబాద్ వ్యక్తి అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

దిశపై అసభ్య వ్యాఖ్యలు.. నిజామాబాద్ వ్యక్తి అరెస్ట్.. 

December 3, 2019

Nizamabad man arrested for Vulgar comments on disha incident

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా హత్యాచార ఘటనపై అందరూ ముక్తకంఠంతో ‘అయ్యో పాపం’ అంటున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను నివారించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. తమ ఇంటి ఆడబిడ్డకే తీరని అన్యాయం జరిగిందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘నిందితులు ఎంత దుర్మార్గంగా చంపారో.. ఆ సమయంలో బాధితురాలు ఎంత ఏడ్చిందోనని’ ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో యువతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ‘ఇవాళ బయట అమ్మాయికి అన్యాయం జరిగింది.. రేపు మనింట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు’ అని ఆడపిల్లల కన్నవాళ్లు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఏర్పడింది. 

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు లఫూట్‌గాళ్లు ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నారు. ‘అంత రాత్రి పూట అమ్మాయి ఒంటరిగా బయటకు ఎందుకు వెళ్లింది? మంచి శాస్తి జరిగింది’ అని కొందరు చాలా దుర్మార్గంగా హింసను ప్రోత్సహిస్తూ పోస్టులు పెడుతున్నారు. కనీస మానవత్వం కూడా మరిచి తమలోని రాక్షసత్వాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు. దిశా ఇంట్లో ఇద్దరూ ఆడపిల్లే.. ఇంటి అవసరాలన్నీ వారే చూసుకోవాలనే ఇంగితం కూడా లేకుండా మనసుకు ఏది అనిపిస్తే అది రాసేస్తున్నారు. ఏది రాసినా చెల్లుతుంది అనుకున్నారేమో. కానీ, వారి రాతలను ఖండించిన కొందరు మానవతావాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వాళ్ల పోస్టుల కింద తొలుత కామెంట్లు పెట్టారు. వెంటనే ఆ పోస్టులను డిలీట్ చెయ్యండని మర్యాదగా చెప్పారు. వారికి పోలీసుల మర్యాద ఇంకలేదు. ఫేక్ ఐడీ కాబట్టి పోలీసులకు దొరికే ఛాన్స్ లేదనుకున్నారేమో.. మరింత రెచ్చిపోతూ పిచ్చి పోస్టులు పెడుతూనే ఉన్నారు. వారికి వంతపాడుతూ కొంత మంది పెడుతున్న కామెంట్లు ఆడిపిల్లల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. బాధితురాలిని తన కుటుంబ సభ్యలను కించపరిచేలా ఉన్నాయి. అంతే కాకుండా అత్యాచారాలు, హత్యలు తప్పే కాదన్నట్టుగా కామెంట్లను పెడుతున్నారు.

 

దీంతో ఇక పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌గా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.