సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కేఎంసీ పీజీ ఫస్టియర్ విద్యార్థిని ప్రీతి ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఏ కారణమంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడనే విషయం బయటకు రాలేదు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. బంధువుల మాత్రం విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ కాగా.. డాక్టర్ అవుతాడన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విషమంగానే ప్రీతి ఆరోగ్యం
సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడంతో.. నాలుగు రోజుల క్రితం పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కేఎంసీ పీజీ ఫస్టియర్ విద్యార్థిని ప్రీతి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి..కోర్డు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు సైఫ్‌కు మద్దతుగా కొంతమంది వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకించారు. సైఫ్‌పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో.. ఉన్నతాధికారులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది .ఇబ్బందిపెట్టాడని.. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మాట్లాడాడని తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.