నిజామాబాద్‌లో 'పసుపు బోర్డు'..సోషల్ మీడియా లీక్ మాత్రమేనా! - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో ‘పసుపు బోర్డు’..సోషల్ మీడియా లీక్ మాత్రమేనా!

January 16, 2020

BJP01

సంక్రాంతి పండుగ పర్వదినాన..తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందని… నిజామాబాద్‌లో ‘పసుపు బోర్డు’ ఏర్పాటు దిశగా మోదీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై జనవరి 25 తరువాత అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జనవరి 25 తరువాత కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి దీనిపై ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీని గురించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ట్వీట్ చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లాంటివి రాలేదు. దీంతో ఈ అంశం పలు అనుమానాలకు తావిస్తోంది. తనను గెలిపిస్తే పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతులకు హామీఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు అరవింద్‌ను గెలిపించారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినప్పటికీ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ముందుకెళ్లలేదు. ఓ దశలో పసుపు బోర్డు ఏర్పాటు కాదనే భావన వ్యక్తమైంది. దీంతో అరవింద్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిని మభ్యపెట్టడానికే సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేయిస్తున్నారని.. ఇది కేవలం ఒక సోషల్ మీడియా లీకు మాత్రమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఒకవేళ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న లీకులు నిజమైనా..నిజామాబాద్‌‌లో ఏర్పాటుకాబోతున్నది సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ వ్యవస్థ, పసుపు ప్రమోషన్ హబ్ మాత్రమే అని.. అది నిజామాబాద్ రైతులు కోరుకున్న పసుపు బోర్డు కాదని పలువురు భావిస్తున్నారు. 

స్వయంగా ఎంపీ అరవింద్ కూడా నిన్నటి నుంచి పసుపు గురించి రెండు ట్వీట్స్ చేశారు. కానీ, ఎక్కడా పసుపు బోర్డు గురించి ప్రస్తావించలేదు. ఒక ట్వీట్‌లో మాత్రం ‘పసుపు ప్రమోషన్’ అని రాసుకొచ్చారు. అయితే గత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి వల్లనే స్పెషల్ పసుపు ప్రమోషన్ సెల్, సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కవిత ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రం వీటి ఏర్పాటుకు రూ.20కోట్ల నిధులను కేటాయించింది. దీనికి సంబంధించి ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో అప్పట్టి కేంద్రమంత్రి సురేష్ ప్రభుని ఎంపీ కవిత కలిసి పసుపు ప్రమోషన్ హబ్ గురించి చర్చించినట్లుగా ఉంది. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తుంటే.. కాదు అది పసుపు ప్రమోషనల్ హబ్ మాత్రమే. అది కవిత ఎంపీగా ఉన్నప్పుడే జరిగిందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే జనవరి 25 వరకు వేచి చూడాలి.