ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదు: ఉద్ధవ్ ఠాక్రే - MicTv.in - Telugu News
mictv telugu

ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదు: ఉద్ధవ్ ఠాక్రే

March 21, 2022

nhcf

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో ఎటువంటి పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మరఠ్వాడ, విదర్భలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన విర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీది బూటకపు హిందూత్వని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరి హయాంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఎన్ని నిర్ణయాలు జరిగాయో చూశాం. వారిని పాకిస్థాన్ జనతా పార్టీ అంటారా? హిజ్బుల్ జనతా పార్టీ అంటారా? గతంలో ఇస్లాంకి ముప్పు పొంచి ఉందని.. ఇప్పుడు హిందువులకు ముప్పు పొంచి ఉందని భయాందోళనకు గురిచేస్తున్నారు.

శివసేనను జనబ్ సేన అని పిలుస్తున్నారు. మేము హిందుత్వాన్ని వదులుకోలేదు. ఎంఐఎం గేమ్ చూస్తుంటే కారణం లేకుండానే మహావికాస్ అఘాడీలో చేరతానని ఆఫర్ ఇచ్చింది. దాని వెనుక అసలు ట్రిక్ ఇదీ. ఎంఐఎం ఆఫర్‌‌ను స్వీకరించిన తర్వాత సేన హిందుత్వానికి దూరమైందని బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన, దాని హిందుత్వ విధానాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న బీజేపీ ‘బీ-టీమ్’ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. శివసేనను జనబ్ సేన అంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు.

మరోపక్క మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌ ఆరోపించిన పోలీస్ అధికారుల బదిలీల అంశంపై దర్యాప్తు గురించి ఉద్ధవ్ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతల స్టేట్‌మెంట్‌లను పోలీసులు రికార్డు చేస్తున్నారన్న ఆగ్రహంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర శాసన మండలికి ఎంవీయే నామినేట్ చేసిన 12 మంది జాబితాకు గవర్నర్ బీఎస్ కోష్యారీ ఆమోదముద్ర వేయకపోవడాన్ని ఏమంటారు. సస్పెన్షన్‌ వేటుపడిన 12 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో న్యాయం జరిగిందని అంటున్నారు. వారి సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. అలాగని తప్పుబట్టలేదు. కేవలం సస్పెన్షన్ సమయాన్ని తగ్గించింది. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సిఫార్సు చేసిన 12 ఎమ్మెల్సీల నామినేషన్లను గవర్నర్ జాప్యం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?’ అని ప్రశ్నించారు.